గత కొంత కాలంగా రైళ్లలో దొంగతానాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దొంగలు ప్రయాణీకుల సెల్ ఫోన్లను కొట్టేస్తున్నారు. సెల్ ఫోన్లు దొంగతనం చేస్తూ ప్రయాణీకులకు దొరికి దొంగలు వీపు విమానం మోత మోగించుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రయాణీకులలో అవగాహన కల్పించేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఓ రైల్లో పోలీసులు ప్రయాణీకుల దగ్గరికి వెళ్లి దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ప్రయాణీకుడి సెల్ ఫోన్ ను పోలీసులే దొంగతనం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దొంగతనాల పట్ల ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ పోలీసులు ఓ స్లీపర్ కోచ్ లోకి వచ్చారు. ఓ అప్పర్ బెర్త్ మీద ప్రయాణీకుడు పడుకుని ఉన్నాడు. అతడు తన పక్కనే సెల్ ఫోన్ ను పెట్టుకుని నిద్రపోతున్నాడు. అయితే, అతడి ఫోన్ దొంగలు కొట్టేసినా పట్టించుకునే పరిస్థితిలో లేడు. వెంటనే రైల్వే పోలీసులు నెమ్మదిగా అతడి ఫోన్ ను తీసుకున్నారు. అయినా, సదరు ప్రయాణీకుడు నిద్రపోతూనే ఉన్నాడు. కాసేపటి పోలీసులే అతడిని నిద్రలేపారు. నీ సెల్ ఫోన్ ఎక్కడ అని ప్రశ్నించారు. సదరు వ్యక్తి బెర్త్ మీద చూశాడు. సెల్ ఫోన్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు. రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో తమ వస్తువుల పట్ల ప్రయాణీకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్లు మాత్రమే కాదు, లగేజీ విషయంలోనూ అలర్ట్ గా ఉండాలన్నారు. చివరికి అతడి సెల్ ఫోన్ ను తిరిగి ఇచ్చేశారు. పోయిందనుకున్న సెల్ ఫోన్ మళ్లీ దొరకడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!
ఇక ఈ వీడియోపై నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. “దొంగతనం జరిగిన తర్వాత బాధపడటం కంటే, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పోలీసులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను ఇంకా కల్పించాలి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రయాణీకులు అంత అజాగ్రత్తగా ఉన్న తర్వాత దొంగతనాలు జరుగుతున్నాయని రైల్వేను నిందించి ఏం లాభం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. దొంగతనాల గురించి రైల్వే చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, రైళ్లలో సెక్యూరిటీ సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అటు పోలీసులు అవగాహన కార్యక్రమాల పట్ల ప్రయాణీకులు, నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!