Qantas Airways Project Sunrise: ప్రపంచంలోనే అత్యంత పొడవైన విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లాగ్ క్యారియర్ క్వాంటాస్ ఎయిర్ వేస్ ప్రపంచంలోనే సుదూర ప్రయాణం చేసే విమానాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ‘ప్రాజెక్ట్ సన్ రైజ్’ అని పిలువబడే ఈ సేవ 2027 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫ్లైట్ జర్నీ సిడ్నీ నుంచి లండన్ వరకు కొనసాగనుంది. ఏక బిగిన 20 గంటలకు పైగా ప్రయాణం కొనసాగిస్తుంది. మొత్తం 17,800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.
ప్రత్యేకంగా రూపొందించిన ఎయిర్ బస్ A 350- 1000
ఈ ఐకానిక్ జర్నీ కోసం.. క్వాంటాస్ ఎయిర్ వేస్ సంస్థ ఎయిర్ బస్ A 350- 1000ను ప్రత్యేకంగా తయారు చేయిస్తోంది. ఈ విమానంలో దాదాపు 238 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో ఫస్ట్ క్లాస్, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ తరగతులు ఉంటాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి ప్రీమియం వర్గాలకు 40 శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయించారు. విమానంలో ఫస్ట్ క్లాస్ లో ప్రత్యేకమైన క్యాబిన్లు ఉంటాయి. ప్రతి క్యాబిన్ లో 32 ఇంచుల స్క్రీన్ ఉంటుంది. ఒక వాష్‌రూమ్, ఒక బెడ్, ఒక రిక్లైనర్ చైర్ ఉంటుంది. ప్రీమియం ఎకానమీ, ఎకానమీ తరగతుల్లోని ఎర్గోనామిక్ సీట్లు మంచి లెగ్ రూమ్‌ను అందిస్తాయి. ప్రైవసీ కోసం బిజినెస్ క్లాస్‌లో ప్రైవసీ వాల్స్ ఉంటాయి. ప్రయాణీకులు వెల్ బీయింగ్ జోన్ లో స్నాక్స్, ఇతర రిఫ్రెష్‌మెంట్లను ఆస్వాదించవచ్చు. అన్ని క్లాస్ ల ప్రయాణీకులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా..
సిడ్నీ నుంచి లండన్ వరకు ప్రయాణం సుమారు ఒక రోజు పడుతుంది. ప్రయాణీకులు జెట్ లాగ్ తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ జెట్ లాగ్ ను తగ్గించేందుకు క్వాంటాస్ సిడ్నీ యూనివర్సిటీలోని ఛార్లెస్ పెర్కిన్స్ సెంటర్ నిపుణులతో కలిసి పని చేస్తోంది. ప్రత్యేకమైన లైటింగ్, నిద్రకు సహాయపడేలా ప్రత్యేకంగా రూపొందించిన మెనూ, క్యాబిన్ ల లోపల వ్యాయామ సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.
మూడు ఎయిర్ బస్ A 350- 1000లతో సర్వీసులు
సిడ్నీ నుంచి లండన్ తో పాటు న్యూయార్క్ వరకు తన విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని క్వాంటాస్ భావిస్తోంది. ఈ సుదూర మార్గాల్లో రోజువారీ సేవలను నిర్వహించడానికి క్వాంటాస్ ఎయిర్ వేస్‌కు కనీసం మూడు ఎయిర్‌బస్ A350–1000 విమానాలు అవసరం. ఈ ఎయిర్‌లైన్ కంపెనీ 2026 వరకు ఆ విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. A350–100 విమానం ఎక్కువ ఇంధనాన్ని కలిగి ఉండేలా మోడిఫై చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. 2027 ప్రారంభం నాటికి ఈ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని క్వాంటాస్ ఎయిర్ వేస్ భావిస్తోంది. క్వాంటాస్ ఎయిర్‌వేస్ కలల ప్రాజెక్ట్ విజయవంతం అయితే, విమానయాన పరిశ్రమలో ఓ మైల్ స్టోన్ గా నిలువనుంది.
Read Also: విమానంలో షర్టులు విప్పి కూర్చున్న ప్రయాణీకులు.. ఏం చేస్తారు పాపం, పరిస్థితి అలాంటిది!