Air India Express Flight AC Failure: విమానం టేకాఫ్ అయిన తర్వాత పలు సందర్భాల్లో ప్రయాణీకులు ఇబ్బందులు పడిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అలాంటి పరిస్థితి ప్రయాణీకులకు మరోసారి ఎదురయ్యింది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఏసీ ఫెయిల్యూర్ ఏర్పడింది. ప్రయాణీకులు ఉక్కపోతతో చుక్కలు చూశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఢిల్లీ నుంచి భువనేశ్వర్ కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. గురుగ్రామ్ కు చెందిన ఓ ప్రయాణీకుడు శ్వాస సరిగా ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన తుషార్ కాంత్
తుషార్ కాంత్ రౌత్ అనే ప్రయాణీకుడు విమానంలో ఏసీ ఫెయిల్యూర్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ కు వెళ్లే IX-1128 విమానంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించాడు. విమానంలోని ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ దాదాపు రెండు గంటల పాటు పని చేయలేదని చెప్పాడు. దీని వల్ల క్యాబిన్ లో పరిస్థితి చాలా అసౌకర్యంగా మారినట్లు వివరించాడు. ఇంకా చెప్పాలంటే, అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నట్లు చెప్పాడు. “విమానం మధ్యాహ్నం 3:55 గంటలకు బయల్దేరింది. కాసేపటికే ఏసీ పని చేయడం ఆగిపోయింది. ఎండ తీవ్రతకు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భరించలేని వేడి చాలా మందిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రయాణీకులలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది” అని రాసుకొచ్చాడు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎయిర్ ఇండియా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించాడు. ప్రయాణీకులు చెమటలు పట్టి, అసౌకర్యంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా
అటు ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు కోరింది. ఓపెన్ డోర్లు, పరిమిత విద్యుత్ సరఫరా కారణంగా బోర్డింగ్, టాక్సీయింగ్ సమయంలో ఏసీ తక్కువ వచ్చినట్లు అనిపిస్తుందని ఎయిర్ లైన్ వివరించింది. అయితే, టేకాఫ్ తర్వాత సిస్టమ్ పూర్తిగా పని చేయలేదనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. “ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ అభిప్రాయంతో మేం ఏకీభవిస్తున్నాం. మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. మా సేవలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాము” అని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. విమానాలు బయలుదేరే ముందు అన్ని వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయో? లేదో? పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు చెందిన విమాన ప్రయాణాలకు సంబంధించి కలిగిన అసౌకర్యాల గురించి ప్రస్తావించారు.
Read Also: మిడిల్ బెర్త్ విరిగి ప్రయాణీకురాలికి తీవ్ర గాయాలు, కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయని రైల్వే అధికారులు!