Indian Railways: ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణం చేసేలా భారతీయ రైల్వే తగిన చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రైళ్లలో భద్రతను పెంచింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. అదే సమయంలో ఎమర్జెన్సీ పరిస్థితులలో రైళ్లను ఆపేందుకు అలారం చైన్ ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ చైన్ ను మిస్ యూజ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రైల్వే సంస్థ వెల్లడించింది. జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపింది. రైలు చైన్ లాగే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి, తప్పదు అనుకుంటేనే లాగాలని సూచిస్తున్నారు.
అలారం చైన్ ఎలా పని చేస్తుందంటే?
రైల్లోని అలాం చైన్ ను ఎవరైనా లాగినప్పుడు కోచ్ బ్రేక్ పైపు లో ఒక చిన్న వాల్వ్ ను ఓపెన్ చేస్తుంది. పాత రైళ్లలో, ఈ పైపు వాక్యూమ్ బ్రేక్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. కొత్త రైళ్లలో ఎయిర్ బ్రేక్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. గొలుసును లాగడం వల్ల పైపులోని గాలి విడుదల అవుతుంది. గాలి పీడనంలో మార్పు క్యాబిన్ లోని మీటర్ ద్వారా లోకో పైలెట్ కు తెలుస్తుంది. రైలు బ్రేక్‌లు ఆటో మేటిక్ గా ఆన్ అవుతాయి. రైలు వేగాన్ని తగ్గించి ఆగిపోతుంది. రైలు గంటకు 110 కి.మీ వేగంగా వెళుతుంటే, పూర్తిగా ఆపడానికి దాదాపు 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. చైన్ లాగినప్పుడు, గొలుసు లాగిన కోచ్ వెలుపల ఎరుపు లైట్లు ఆన్ అవుతాయి. రైలు సిబ్బందికి ఏ కోచ్‌ను తనిఖీ చేయాలో ఈజీగా తెలిసిపోతుంది. రైలు గార్డు, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేయడానికి లోకో పైలెట్ రైలు హారన్‌ను మూడుసార్లు మోగిస్తాడు.
అలారం చైన్ ను ఎప్పుడు ఉపయోగించాలంటే?
అలారం చైన్ అనేది రైల్వే ప్రయాణీకులలు ముప్పులో ఉన్న సమయంలో ఉపయోగించేలా రూపొందించారు. దొంగతనాలు, ప్రమాదాలు జరిగినప్పుడు చైన్ లాగవచ్చు. ప్రయాణీకులలో ఎవరికైనా గుండెపోటు, మూర్ఛ సహా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే సమయంలో అలారం చైన్ ను లాగే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో మాత్రమే అలారం ఉపయోగించాల్సి ఉంటుంది. అలారం చైన్ ను ఎమర్జెన్సీ పరిస్థితులలో కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగిస్తే మిస్ యూజ్ చేసినట్లు రైల్వే అధికారులు భావిస్తారు. నిర్ణీత ప్రదేశాల్లో కాకుండా అనధికారిక ప్రదేశాల్లో చైన్ లాగి రైలు ఎక్కడం, దిగడం లాంటివి చేస్తే నేరంగా పరిగణిస్తారు.
141 ప్రకారం రైల్వే అధికారుల చర్యలు
భారతీయ రైల్వే అలారం చైన్ కు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. రైల్వే చట్టంలోని సెక్షన్ 141ను ప్రత్యేకంగా అలారం చైన్ కోసం రూపొందించింది. తొలిసారి నేరం చేస్తే, సుమారు రూ. 1000 వరకు జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. పదే పదే ఇదే తప్పు చేస్తే జరిమానాతో పాటు శిక్ష తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అలారం చైన్ లాగితే సాధారణ జరిమానాతో పాటు ఆయా పరిస్థితులకు అనుగుణంగా అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. రైలు ఆపి వెళ్లేందుకు అవసరమైన ఖర్చును కూడా వసూళు చేస్తారు. ఒకవేళ రైలు ఆగడం వల్ల ఇతర రైళ్లు తీవ్ర ప్రభావానికి గురైతే అదనపు ఛార్జీలు కూడా విధించే అవకాశం ఉంటుంది. డబ్బులు చెల్లించకపోతే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అందుకే, రైల్లో అలారం చైన్ ను అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు రైల్వే అధికారులు.
Read Also: ఇక ఇండియాలో కదిలే ఇల్లు.. ఉబెర్ సరికొత్త సర్వీస్.. ముందు ఈ నగరాల్లోనే!