Trains Bypassing Visakhapatnam Junction | విశాఖపట్నం రైల్వే జంక్షన్ మీదుగా గత కొంతకాలంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రైన్లను బైపాస్ చేసి వేరే మార్గాల్లో నడుపుతున్నారు. ఈ అంశంపై ప్రయాణికులు రైల్వే యజమాన్యంపై మండిపడుతున్నారు. దీని వల్ల విశాఖపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు జరిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కానీ రైల్వే అధికారులు మాత్రం ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తమ నిర్ణయం సరైనదేనని సమర్థించుకుంటూ ప్రతీసారి వేర్వేరు కారణాలు చెబుతున్నారు. ప్రారంభంలో విశాఖపట్నం జంక్షన్ లో బల్బ్ లైన్ సమస్య ఉందని చెప్పారు. అయితే ఇది స్టీమ్ ఇంజిన్ల కాలంలో ఉండేది. అంటే స్టీమ్ ఇంజిన్ ఉండే ట్రైన్లు వెనక్కు మళ్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అందుకే వాటిని చివరి స్టేషన్ లో తిరుగు ప్రయాణం కోసం వెనుక దిశలో మళ్లించేందుకు బల్బ్ లైన్ నిర్మించి మళ్లించేవారు. కానీ ఇప్పుడు డీజిల్, ఎలెక్ట్రిక్ లోకోమొటివ్ ఇంజిన్లు వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.
అందుకే బల్బ్ లైన్ నెపం చెల్లదు కాబట్టి ఇప్పుడేమో విశాఖపట్నం జంక్షన్ లో ట్రైన్ ఇంజిన్లు రివర్స్ చేసుకునేందుకు చాలా సమయం పడుతోందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఈ మార్గాన్ని బైపాస్ చేయడమే రైల్వేకు మంచి ప్రత్యామ్నాయమని మాటమార్చారు. 2024 సెప్టెంబర్ 9న ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంలో రైల్వే ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశాఖపట్నం జంక్షన్ మీదుగా వెళ్లే 24 ట్రైన్లు (12 జతలు – ఒకే రూట్లో రాకపోకలు) దారి మళ్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 2024 సంవత్సరం ప్రతామార్థంలో కూడా జైపూర్ లో జరిగిన మీటింగ్ ఇదే ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు దారి మళ్లించిన ట్రైన్లు విశాఖపట్నం మీదుగా కాకుండా కొత్త వలస, సింహాచలం నార్త్, దువ్వాడ మార్గంలో నడుస్తాయి. అయితే అన్ని ట్రైన్లు ఈ స్టేషన్లలో ఆగవు. కేవలం కొన్ని ట్రైన్లకు మాత్రమే దువ్వాడ, పెందుర్తి స్టేషన్లలో స్టాపింగ్స్ ఉంటాయి.
Also Read: వేసవి సెలవుల్లో కర్ణాటక చుట్టేయండి.. హైదరాబాద్ వాసులకు ఐఆర్‌సిటిసి ఆఫర్!
ఇలా చేయడం వల్ల విశాఖపట్నం జంక్షన్ లో ఇంజిన్ రివర్సల్ టైమ్ మిగులుతుందని, పైగా విశాఖపట్నం యార్డ్ లో ట్రాఫిక్ తగ్గిపోతుందని, ట్రైన్ల సంఖ్య తగ్గడంతో ఇతర మార్గాల నుంచి వచ్చే ట్రైన్లకు ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వాదిస్తున్నారు. కానీ విశాఖ వాసులు, ఈ మార్గంలో ప్రయాణించే వారు మాత్రం ఈ వాదనలతో ఏకీభవించడం లేదు. లోకల్ ట్రైన్లు, మెట్రో ట్రైన్లు ఎక్కువ సంఖ్య రాకపోకలు చేసే చెన్నై, హౌరా లాంటి స్టేషన్లకు మంచి వసతులున్నాయని.. కానీ దువ్వాడ, కొత్తవలస, పెందుర్తి స్టేషన్లలో అలాంటి వసతులు లేకున్నా.. ఆ మార్గాల్లో ట్రైన్లు మళ్లించడం ఏ మాత్రం సమర్థనీయం కాదంటున్నారు. పైగా దువ్వాడ, పెందుర్తి లాంటి స్టేషన్లలో అర్ధరాత్రి ట్రైన్ల ద్వారా చేరుకునే ప్రయాణికులకు అక్కడి నుంచి రవాణా సౌకర్యాలు లేవని చెబుతున్నారు.
ఇక అన్నింటి కంటే ముఖ్యమైన కారణం.. విశాఖపట్నం జంక్షన్ (Visakhapatnam Junction) బైపాస్ చేసి ఇతర మార్గంలో సుదూర ప్రయాణం చేసే ట్రైన్లు పయనిస్తే.. సమయం ఆదా ఏమాత్రం కాదని ఎత్తిచూపుతున్నారు. ఆ ట్రైన్లకు విజయనగరం, దువ్వాడలో స్టాపింగ్ ఉంటాయి కాబట్టి అక్కడ సమయం కేటాయించాల్సిందే కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా దువ్వాడ మార్గంలో గూడ్స్ ట్రైన్ల సంఖ్య ఎక్కువ కావడంతో ట్రైన్లకు ట్రాఫిక్ సమస్య కూడా ఉంటుంది. అదే విశాఖపట్నం జంక్షన్ లో ఒక ట్రైన్ ఆగితే ఇంజిన్ రివర్స్ చేసుకోవడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఆ సమయంలో ట్రైన్ క్లీనింగ్, ఇంధనం నింపడం లాంటి పనులు పూర్తవుతాయి. అంటే సమయం వృధా అనే కారణం చెప్పడం సబబు కాదు.
వాల్తేరు డివిజన్ పరిధిలో సౌత్ కోస్ట్ రైల్వే.. ట్రైన్ ఆపరేషన్స్ వేగవంతం చేయడమే ఈ సమస్యకు సమాధానమని విశాఖ జంక్షన్ ప్రయాణికులు సూచిస్తున్నారు.