AP Govt: ఏపీ ప్రజలకు రేపో మాపో శుభవార్త చెప్పనుంది కూటమి సర్కార్. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు దాదాపు 9 నెలలు గడుస్తోంది. ఎలాంటి పథకాలు ప్రకటన చేయలేదు. దీంతో ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. స్కీమ్‌ల కంటే ముందు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలంటూ ప్రజలు కోరుతున్నారు. దీన్ని గమనించిన చంద్రబాబు సర్కార్, ఆరోగ్య పథకం విషయంలో ప్రజలకు శుభవార్త చెప్పాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్యామిలీ హ్యాపీగా ఉండేలా
రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకానికి అంతా రెడీ అవుతోంది. దీనికి సంబంధించి రేపో మాపో టెండర్లను పిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద ఏడాదికి రూ.25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. రానున్న కొత్త బీమా విధానంలో ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికలు వేస్తోంది.
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు కొనసాగుతాయి. ఏడాదికి రూ.2.5 లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండరు పిలవనున్నారు. ఆపైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు భరించనుంది. రాష్ట్రంలో రెండున్నర లక్షల్లోపు వ్యయమయ్యే చికిత్సలు పొందేవారి సంఖ్య 97 శాతం ఉంది.
వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. దీని పరిధిలో దాదాపు 1.43 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 8.5 లక్షల మంది ఉన్నారు. బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ సుమారు రూ.7 వేల వరకు చెల్లిస్తోంది. అయితే ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్నవారికి కాకుండా మిగతా వారికి బీమా విధానాన్ని వర్తింపచేయాలని ఆలోచన చేస్తోంది.
ALSO READ: వివేకా పీఏ ఫిర్యాదుపై నివేదిక.. న్యాయస్థానం తీర్పు ఎటు
మిగతా రాష్ట్రాల మాటేంటి?
ప్రతి కుటుంబం తరఫున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం రూ.2,500 వరకు ఉండొచ్చని భావిస్తోంది ప్రభుత్వం. జాతీయ స్థాయిలో పిలిచే టెండర్లకు ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీలు పోటీపడతాయని భావిస్తోంది. ఈ తరహా స్కీమ్ తమిళనాడు, ఝార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో ఉన్నాయి. బీమా సంస్థల ద్వారా అక్కడివారికి వైద్య సేవలు వేగంగా అందుతున్నాయి. అదే కాన్సెప్ట్‌ను ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలన్నది ప్రభుత్వ వర్గాల ఆలోచన.
ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల సమయం పడుతోంది. అదే బీమా విధానంలో అయితే కేవలం 6 గంటల్లో అనుమతి లభిస్తుందని అంచనా వేస్తోంది. చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే ఏంటన్నది అసలు ప్రశ్న. దీనిపై అప్పీలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు. ఈ పద్దతిలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయని చెబుతున్నారు.
ఎంపిక చేసిన బీమా కంపెనీ మూడేళ్లపాటు సర్వీసు అందించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది బీమా కంపెనీ పనితీరు సమీక్షిస్తుంది ప్రభుత్వం. ఎంపికచేసిన బీమా సంస్థలకు ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రభుత్వం ముందుగా చెల్లింపులు చేస్తుంది. దీనివల్ల ఎలాంటి సమస్య తలెత్తదని భావిస్తోంది. ప్రస్తుతం 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అందే 1,949 రకాల చికిత్సలూ ఇందులో ఉండనున్నాయి. దీనిపై సమీక్షలు తర్వాత ఇంకెన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో చూడాలి.