Indian Railways: అత్యవసర కోటా రైల్వే టికెట్లు మిస్ యూజ్ అవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో రైల్వేశాఖ అలర్ట్ అయ్యింది. ఈ టికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత రైల్వే అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా అత్యవసర కోటా కింద రైళ్లలో సీటు, బెర్త్ రిజర్వేషన్ల కోసం ట్రావెల్ ఏజెంట్ల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోకూడదని జోనల్ అధికారులకు తేల్చి చెప్పింది. కొంత మంది అనధికారికంగా అత్యవసర కోటా నుంచి టికెట్ల కోసం ప్రయత్నించినట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని రైల్వేశాఖ 17 రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు లేఖ రాసింది.
2011లో అత్యవసర కోటాకు మార్గదర్శకాలు
అత్యవసర కోటాకు సంబంధించి రైళ్లలో సీట్లు, బెర్తులు విడుదల చేసే విధానాన్ని క్రమబద్ధీకరించడానికి రైల్వేశాఖ 2011లో వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కోటా టికెట్ల దుర్వినియోగం గురించి ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా, సంబంధిత అధికారులు అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను ఇందులో పొందుపరిచింది. “అత్యవసర కోటా టికెట్ల కేటాయింపునకు సంబంధించి ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను కచ్చింతగా ఫాలో కావాలి. అత్యవసర కోటా నుంచి బెర్తులు/సీట్లను కేటాయించాలంటే రాతపూర్వక అభ్యర్థనలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది” అనే విషయాన్ని గుర్తు చేసింది.
ట్రావెల్ ఏజెంట్లతో జాగ్రత్త!
ఇక అత్యవసర కోటా నుంచి టికెట్ల కోసం అభ్యర్థనను స్వీకరించిన తర్వాత, సంతకం చేసిన వ్యక్తి తన పేరు, హోదా, మొబైల్ నంబర్, ప్రయాణీకులలో ఒకరి మొబైల్ నంబర్ ను పేర్కొనాలని సూచించింది. ప్రతి అధికారి అత్యవసర కోటా కోసం దరఖాస్తు వివరాలను కలిగి ఉన్న రిజిస్టర్ ను మెయింటెయిన్ చేయాలని ఆదేశించింది. రిజిస్టర్‌లో నమోదు చేయబడిన అభ్యర్థనకు సంబంధించి డైరీ నంబర్ కూడా అత్యవసర కోటా కోసం అభ్యర్థనలపై సూచించబడుతుందని లేఖలో పేర్కొంది. అత్యవసర టికెట్ తీసుకున్నవ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలను పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని వెల్లడించింది. ఇక మిస్ యూజ్ కు సంబంధించిన అభ్యర్థనల నుంచి దూరంగా ఉండాలని అధికారులను హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రావెల్ ఏజెంట్ల నుంచి అత్యవసర కోటా టికెట్ల కోసం వచ్చే రిక్వెస్టులను పరిగణలోకి తీసుకోకూడదని కచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది.
ఆ రిక్వెస్ట్ ఫారమ్ లను ఇవ్వకండి!
ఇక చట్టవిరుద్ధ కార్యకలాపాలను తనిఖీ చేయడానికి, రిజర్వేషన్ కార్యాలయాలలో పనిచేసే అధికారులతో దళారుల మధ్య సంబంధాన్ని నివారించడానికి అధికారులు PRS (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కేంద్రాలను తరచుగా తనిఖీ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ సూచించింది. అత్యవసర కోటా కింద కేటాయించిన టికెట్లకు సంబంధించిన వివరాలను సుమారు 3 నెలల వరకు భద్రపరచాలని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అధికారి కూడా తన వ్యక్తిగత సిబ్బందికి అత్యవసర కోటా నుంచి బెర్త్ కేటాయింపుకు సంబంధించి ఖాళీ సంతకం చేసిన రిక్వెస్ట్ ఫారమ్ ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.