ఆంధ్రప్రదేశ్ లో విమాన సేవలు రోజు రోజుకు మరింత విస్తరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని నగరాలను కనెక్ట్ చేసేలా విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాల మధ్య విమాన సేవలు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్లు రామ్మోహన్ నాయు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ మార్గం లో అలయన్స్ ఎయిర్ ATR 72 విమాన సర్వీసులు ప్రారంభించబడతాయన్నారు.
ఇక రాజమండ్రి- తిరుపతి విమానానికి సంబంధించి షెడ్యూల్ ను కూడా ఆయన ప్రకటించారు. అక్టోబర్ 1న ఉదయం 09:25 గంటలకు విమానం తిరుపతి నుంచి రాజమహేంద్రవరం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 10:15 గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరుతుంది . అక్టోబర్ 2న నుంచి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులు నడుస్తాయి. ఈ నూతన సర్వీసు ఉదయం 07:40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, తిరిగి ఉదయం 09:50 గంటలకు రాజమహేంద్రవరం నుండి బయలుదేరుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Read Also: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!
ఈ విమాన సర్వీసు ప్రారంభంతో ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే కాకుండా, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అనేకమంది భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు రామ్మోహన్ నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ అనే ఆలోచనకు అనుగుణంగా ఈ సర్వీసును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో విమాన సర్వీసులను నడిపేందుకు అంగీకరించిన అలయన్స్ ఎయిర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు ఈ విమాన సర్వీసులను ఉపయోగించుకోవాలని రామ్మోహన్ నాయుడు సూచించారు.
Read Also: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!