Vande Bharat Sleeper Manufacture: భారతీయ రైల్వే సంస్థ త్వరలో సరికొత్త వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించిన ట్రయల్స్ కొనసాగుతున్నాయి. గత డిసెంబర్ చివరి వారం నుంచి రాజస్థాన్ లోని కోటాలో స్లీపర్ రైళ్ల ట్రయల్స్ మొదలయ్యాయి. స్పీడ్ టెస్ట్ సహా పలు పరీక్షలను నిపుణులు పరిశీలించారు. ఇప్పటి వరకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినట్లు తెలుస్తున్నది.
రూ.55 వేల కోట్లతో వందేభారత్ స్లీపర్ రైళ్ల తయారీ
మరోవైపు పెద్ద సంఖ్యలో వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. ఇందుకోసం ఏకంగా రూ. 55,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. వందేభారత్ స్లీపర్ కోచ్ ల అసలు డిజైన్ కు తాజాగా ఆమోదం తెలిపింది. ప్రస్తుత వందే భారత్ స్లీపర్ రైళ్లలోని ప్రతి కోచ్ లో నాలుగు టాయిలెట్లు, ప్రతి ట్రైన్ సెట్ లో ఒక ప్యాంట్రీ కార్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, ఇకపై ప్రతి కోచ్ లో మూడు టాయిలెట్లు, ప్యాంట్రీ కార్ లేని అసలు డిజైన్‌ను కొనసాగించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ధరలు సవరణకు కేంద్రం నిరాకరణ
ఇక స్లీపర్ రైళ్ల తయారీకి సంబంధించి రష్యన్ సంస్థ SPV, ఇండియన్ రైల్వేస్ PSU, RVNL 1,920 స్లీపర్ కోచ్‌లు(80 ట్రైన్ సెట్లను) తయారు చేయడానికి కాంట్రాక్టు దక్కించుకున్నాయి. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ డిజైన్ కు ఆమోదం తెలపడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. ఎక్కువ ధర ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే, డిజైన్ లో ఎలాంటి మార్పు లేనందున, ధరను సవరించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇక వందేభారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించిన తొలి మోడల్ తయారీ వచ్చే ఏడాదిలోపు జరిగే అవకాశం ఉంది. కినెట్ తో పాటు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL), టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ (TRS) కన్సార్టియంకు భారతీయ రైల్వే సంస్థ 1,280 కోచ్‌ల(53 ట్రైన్‌సెట్ల) తయారీకి ఒప్పందం చేసుకున్నాయి. అంతేకాకుండా, 10 వందే స్లీపర్ రైళ్ల సరఫరా కోసం ఒక ఒప్పందాన్ని నామినేషన్ ప్రాతిపదికన BEML, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)కి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.
జపాన్ నుంచి బుల్లెట్ రైళ్ల దిగుమతి
మరోవైపు జపాన్ నుంచి బుల్లెట్ రైళ్ల దిగుమతికి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారం అయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. దేశంలో తొలిసారి ముంబై- అహ్మదాబాద్ కారిడార్ లో నడపడానికి షింకన్ సెన్ E5 బుల్లెట్ రైళ్లను దిగుమతి చేసుకోనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. “ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికతతో కూడిన రైలును దేశంలోకి దిగుమతి చేసుకోబోతున్నాం. బుల్లెట్ రైలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి సంబంధించిన టెక్నాలజీని దేశీయంగానే తయారు చేస్తున్నాం. వాటిని భవిష్యత్ ప్రాజెక్టులలో ఉపయోగిస్తాం” అని రైల్వే సంస్థకు చెందిన కీలక అధికారులు వెల్లడించారు.
Read Also:రైళ్లకు పేర్లు పెట్టడం వెనుక ఇంత లాజిక్ ఉంటుందా? అస్సలు ఊహించ లేదే!