రష్యాలో అదృశ్యం అయిన ప్యాసింజర్ విమానం ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో విమానంలోని 49 మంది స్పాట్ లోనే చనిపోయారు. ఏఎన్-24 విమానం చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. రష్యా లోని అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం టిండాకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అనగా..
అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఏఎన్- 24 విమానం.. చైనా సరిహద్దు సమీపంలోకి వెళ్లగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. మరికాసేపట్లో విమానం టిండాకు చేరుకుంటుంది అనగా, రాడార్ నుంచి అదృశ్యం అయ్యింది. ఆ సమయంలోనే విమానం క్రాష్ ల్యాండ్ అయినట్లు అధికారులు భావిస్తున్నారు. విమానం ఏటీసీ నుంచి సంబంధాలు కోల్పోగానే అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అయితే, ఈ విమానం టిండాకు సుమారు 15 కిలో మీటర్ల దూరంలో కూలిపోయినట్లు గుర్తించారు. దట్టమైన అడవుల మధ్యలో విమానం క్రాష్ అయ్యింది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసి పడుతూ కనిపించాయి.
ప్రమాదానికి కారణం ఏంటి?
అటు రెస్క్యూ సిబ్బంది విమానం క్రాష్ అయినట్లు గుర్తించిన వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. విమానం నుంచి ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు. వాస్తవానికి విమానం ల్యాండింగ్ చేస్తుండగా వాతావరణం అనుకూలించలేదట. రెండోసారి ప్రయత్నించే క్రమంలోనే రాడార్ నుంచి విమానం అదృశ్యం అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమయంలో విమానం కంట్రోల్ తప్పి కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఐదుగురు చిన్నారుల సహా 49 మంది మృతి
ఇక ఈ ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 49 మంది చనిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మంటల్లో ప్రయాణీకులు అంతా సజీవ దహనం అయినట్లు భావిస్తున్నారు. అచ్చం అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాదిరిగానే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. వారి మృత దేహాలను కూడా డీఎన్ఏ టెస్టుల ద్వారానే గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా? అని ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Read Also: 50 మందితో వెళ్తున్న విమానం గాల్లోనే అదృశ్యం.. ఇంతకీ ఏమైనట్టు?