Russian Plane Missing: గత కొద్ది రోజులుగా విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత వరుస ఘటనలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట విమానాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం, మంటలు చెలరేగడం జరుగుతూనే ఉన్నాయి. విమానం ఎక్కాలంటేనే భయంగా ఉందంటూ పలువురు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు.
50 మందితో వెళ్తున్న విమానం అదృశ్యం
తాజాగా రష్యాలో షాకింగ్ ఘటన జరింది. ప్రయాణీకులతో వెళ్తున్న విమానం మార్గం మధ్యలోనే మిస్ అయ్యింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అన్న సమయంలో ఏటీసీ నుంచి సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు.
సైబీరియాకు చెందిన అంగారా ఎయిర్‌లైన్స్ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది. 50 మందితో బయలుదేరిన విమానం.. ఉన్నట్టుండి ATCతో సంబంధాలు కోల్పోయింది. చైనా బోర్డర్ సమీపంలో అముర్ ప్రాంతంలోని టిండా పట్టణం దిశగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా.. సడన్‌గా ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. “అంగారా ఎయిర్ లైన్స్ నడుపుతున్న ఏఎన్-24 విమానం టిండా మీదుగా వెళ్తుండగా మిస్ అయ్యింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ విమానంలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు సిబ్బందితో సహా 43 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది” అని అధికారులు తెలిపారు.
అలర్ట్ అయిన అధికారులు, గాలింపు చర్యలు ముమ్మరం
విమానం అదృశ్యం అయిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. గాలింపు చర్యలు చేపట్టారు. విమానం కోసం వెతకడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సెర్చ్ ఆపరేషన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. విమానం ఎక్కడ ఉంది, ఇలా జరగడానికి వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే విమానానికి సంబంధించిన వివరాలను కనిపెట్టే అవకాశం ఉన్నట్లు రష్యా విమానయానశాఖ అధికారులు వెళ్లడించారు. విమానంలోని వారంతా క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Read Also: రైల్వే స్టేషన్లలో AI టెక్నాలజీ, ఇక చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది!