సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలలో కొత్త జోష్ వస్తుంది. మూడు రోజుల పాటు జరిగే ప్రతి ఇంట్లో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే చాలు హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది. మూడు రోజుల ఈ పెద్ద పండుగకు తెలుగు రాష్ట్రాల్లో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ. లక్షలాది మంది పల్లె బాట పడతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉంటూ సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే న్యూస్ చెప్పింది.
హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల స్పెషల్ బస్సులు
హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లే సంక్రాంతి ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 5 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ బస్సులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తాయి? ప్రత్యేక బస్సులకు సంబంధించిన ఛార్జీలు ఎలా ఉంటాయి? అనే విషయాలపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.
అందుబాటులో ఉచిత ప్రయాణ సదుపాయం
సంక్రాంతి స్పెషల్ బస్సులు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కంటిన్యూ అవుతుందని వెల్లడించారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులో ఉచింతగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. అయితే, తెలంగాణ బార్డర్ వరకే జీరో టికెట్ విధానం అమలు అవుతుంది. తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జనవరి మొదటి వారం నుంచి జనవరి 17 వరకు సుమారు 10 రోజుల పాటు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
2,400 ప్రత్యేక బస్సులను నడిపించనున్నఏపీఎస్ ఆర్టీసీ
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు జిల్లాలకు 2,400 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సులు జనవరి 9 నుంచి 13 వరకు ఇవి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అయితే, ప్రత్యేక బస్సుల పేరుతో అధిక ఛార్జీలు వసూళు చేయబోమని ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలతోనే నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రజలు ఈ బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. మొత్తంగా ఈసారి సంక్రాంతి పండుగకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ సంస్థలు సుమారు 7,500 బస్సులను నడపబోతున్నారు. ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటికి తోడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ప్రత్యేక సర్వీసులను నడపనున్నాయి. మొత్తంగా ఈసారి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదు.
Read Also: కేబుల్ బ్రిడ్జిపై రైలు.. చరిత్రలో ఇదే తొలిసారి, వీడియో చూస్తే మైండ్ బ్లాకే!