Travel Scheme: ఆనందఆనందమాయే.. అనే పాట పాడుకుంటూ ఉన్నారు. హమ్మయ్య.. ఆ బాధ తప్పిందని అనుకున్నారు. కానీ ఆ ఆనందం మాత్రం ఎక్కువ కాలం నిలవలేదు. అందుకే నేటి రోజుల్లో ముందు అసలు విషయాన్ని గ్రహించాలి. ఆ తర్వాత సంబరపడాలి. పాపం.. అయితే కేంద్రం ఇచ్చిన ప్రకటన అంటూ వైరల్ కావడంతో వారిలో ఆశలు చిగురించాయి. చివరికి అసలు విషయం తెలుసుకొని మాత్రం అరెరె అనే స్థాయికి వచ్చారు. ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది అనుకొనేరు. యావత్ దేశం వైరల్ గా మారింది. ఇంతకు అసలేం జరిగిందో, ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. లేకుంటే ఇలాంటి వార్తలు, మాటలు ఎప్పుడైనా మనల్ని మోసం చేయవచ్చు.
అసలు కథ ఇదే..
ఈ మధ్య సోషల్ మీడియా వేదికలపై ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. జూన్ 15, 2025 నుండి కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం దేశవ్యాప్తంగా ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇది చాలా మంది పెద్దలలో ఆనందం కలిగించినా, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏమి చెబుతున్నాయి వైరల్ వార్తలు?
ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి పాప్యులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్న వైరల్ పోస్ట్ ల ప్రకారం, సీనియర్ సిటిజన్లు త్వరలో ఉచితంగా రైలు, విమానం, ప్రభుత్వ బస్సులు, మెట్రో రైళ్లు వంటి రవాణా మార్గాల్లో ప్రయాణించవచ్చట. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకంగా దీనిని ప్రవేశపెట్టబోతోందని వాటిలో పేర్కొనబడుతోంది. కానీ ఇది నిజమా? అబద్ధమా? అనేది తెలుసుకోవాల్సిందే.
వాస్తవం ఏమిటి?
ఈ విషయంపై పరిశీలించగా, ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన అధికారిక ప్రకటన కానీ, నివేదిక కానీ వెలువడలేదు. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టంగా ఏదీ ఖరారు చేయలేదు. అంతేకాకుండా, గతంలో కొంతకాలం రైళ్లో ఉన్న సీనియర్ సిటిజన్ రాయితీలను కూడా ఆర్థిక పరిమితుల వల్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటిని తిరిగి ప్రవేశపెట్టే ప్రణాళికలు కూడా ప్రస్తుతం లేవని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే, ఎయిర్ ఇండియా వంటి విమాన సేవల సంస్థలు సీనియర్ సిటిజన్‌లకు స్థిరమైన రాయితీలు ఇవ్వడం లేదు. కొన్ని మార్గాల్లో మాత్రమే తక్కువ టికెట్ ధరలు ఉంటాయి. ఇవి కూడా మారుతూ ఉండటం వల్ల ఏకరీతిగా ఉచిత ప్రయాణ అవకాశాలు లేవు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా, కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ రాష్ట్రాలలో సీనియర్ సిటిజన్‌లకు ప్రయాణంలో రాయితీలు అందిస్తున్నాయి.
Also Read: One Rupee Train Ticket: ఒక్క రూపాయికే రైలు టికెట్.. ఇండియన్ రైల్వే ఐడియా అదుర్స్!
ఉదాహరణకు కొన్ని..
ఒడిశా ప్రభుత్వం ముఖ్యమంత్రి బస్ సేవ (MBS) పేరిట ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో AC మరియు నాన్-AC బస్సుల్లో సీనియర్ సిటిజన్‌లకు 50% ఛార్జీ రాయితీ ఉంటుంది. ముంబై మెట్రో 2A, 7 మెట్రో మార్గాల్లో 65 ఏళ్లు పైబడిన సీనియర్ పౌరులకు ముంబై వన్ పాస్ ద్వారా 25% డిస్కౌంట్ లభిస్తుంది. కొచ్చిన్ మెట్రో 75 ఏళ్లు పైబడిన వారికి 50% ఛార్జీ రాయితీ అందిస్తోంది. ఈ పథకాలు రాష్ట్ర స్థాయిలో అమలవుతున్నవి మాత్రమే. దేశవ్యాప్తంగా అమలయ్యే ఉచిత ప్రయాణ పథకం ఇంకా ప్రకటించబడలేదు.
ప్రజలకు హెచ్చరిక
ఇలాంటి అసత్య వార్తలు చూసి నమ్మి షేర్ చేయడం వల్ల అపోహలు ఏర్పడతాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమాచారం తెలుసుకునే ముందు పత్రికా ప్రకటనలు, అధికారిక వెబ్‌సైట్లు, నమ్మదగిన న్యూస్ ఛానళ్లను మాత్రమే పరిశీలించాలి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, ఆర్థికంగా ఆధారపడిన వారు ఇలా ఎటువంటి ధృవీకరణ లేని వార్తలను నమ్మి మోసపోవద్దు. జూన్ 15, 2025 నుండి సీనియర్ సిటిజన్‌లకు ఉచిత ప్రయాణం అందిస్తామని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. భారత ప్రభుత్వం అటువంటి ప్రకటనను ఇంతవరకు విడుదల చేయలేదు. ప్రజలు ఎప్పుడూ అధికారిక వెబ్ సైట్స్, వ్యక్తుల నుండి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. అవాస్తవమైన ప్రచారాలను షేర్ చేయడం వల్ల సమాజంలో గందరగోళం పెరుగుతుంది.