Sankranti Special Trains 2026: పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. సాఫీగా ప్రయాణాలు కొనసాగేలా చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే అదనపు రైళ్లను ప్రకటించింది. తాజాగా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మరో రెండు ప్రత్యేక రైళ్లను అనౌన్స్ చేసింది. పండుగ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే ప్రయాణీకుల కోసం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు రైళ్లు విశాఖపట్నం – చర్లపల్లి మధ్య సర్వీసులు అందించనున్నాయి.
తాజాగా ప్రకటించిన రెండు రైళ్లలో.. రైలు నెంబర్ 08513 విశాఖపట్నం-చర్లపల్లి రైలు జనవరి 18న అందుబాటులోకి వస్తుంది. ఆ రోజు రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు నెంబర్ 08514 జనవరి 19న మధ్యాహ్నం 3:30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు అదనపు రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను కలుపుతూ ప్రయాణిస్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రయాణీకులకు అనుకూలంగా ఉండేలా దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు స్టేషన్లలో ఆగుతాయి. తెలంగాణ విషయానికి వస్తే, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్ల ద్వారా ప్రయాణీకులు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
🚉✨️ Additional Sankranti Special Trains between Charlapalli and Visakhapatnam 🪁#specialtrains #yatrisewa #railyatri #travelsafe pic.twitter.com/bPrMXmCTXE
— South Central Railway (@SCRailwayIndia) January 6, 2026
ఇక సంక్రాంతి అదనపు రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఇవాళ్టి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 08513/08514 రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభ అవుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. పండుగ రద్దీ కారణంగా టికెట్లు త్వరగా అయిపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్ లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
సంక్రాంతి సందర్భంగా నడిపించే ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లు ఫుల్ అయ్యాయి. ఏ రైలు చూసినా పెద్ద సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అదనపు రైళ్లు నడపడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకులు ఐఆర్‌సిటిసి వెబ్ సైట్ తో పాటు రైల్ వన్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒకవేళ ఈ సౌకర్యం లేని వాళ్లు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.
Read Also: లోకల్ ప్రయాణికులకు షాక్.. UTS యాప్ బంద్, ఇక ఆ కొత్త యాప్‌లోనే అన్నీ!