Udaipur Water Palace: నీటిపై తేలే ప్యాలెస్ చూడాలా? ఇక్కడికి వెళితే సరి! ఓ సరస్సు మధ్యలో నిర్మించిన, నీటిపై తేలుతూ కనిపించే అద్భుతమైన కట్టడం.. నిజంగా కథల్లో వచ్చే ప్యాలెస్‌లా ఉంటుంది. ఇది ఊహ కాదు, ఇండియాలోనే ఉందన్న విషయం మీకు తెలుసా? మరి పూర్తి వివరాలు, ఇక్కడి వింతలు విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.
రాజస్తాన్ అనగానే గుర్తొచ్చేది రాజుల గాథలు, కోటలు, ప్యాలెస్‌లు. కానీ వాటన్నిటికీ మించిన వింత ఆకర్షణ ఏమిటంటే.. నీటిపై తేలుతూ రాజరికం ఉట్టిపడేలా కనిపించే ఓ రాజమహల్.. అదే తాజ్ లేక్ ప్యాలెస్, ఉదయపూర్ గర్వంగా చెప్పుకునే అద్భుతమైన ఆభరణం! పిచోలా సరస్సు మధ్యలో నిర్మితమైన ఈ భవనం చూస్తే.. మనసు అదిరిపోయి పోతుంది. ఇది కేవలం హోటల్ మాత్రమే కాదు.. నిజంగా ఒక అద్భుతాన్ని చూడటమే!
నీటిలో తేలే కంచుకాల భవనం
ఉదయపూర్‌కు వెళ్లేవారి లిస్టులో ముందుగా ఉండే ఈ తాజ్ లేక్ ప్యాలెస్, 1746లో మహారాణా జగత్ సింగ్ నిర్మించారు. అప్పట్లో ఇది జగ్ నివాస్ అనే రాజకుమారుల వేసవి నివాసంగా ఉపయోగించేవారు. తెల్లటి మార్బుల్ రాళ్లతో అద్భుతంగా నిర్మించబడిన ఈ భవనం మొత్తం పిచోలా సరస్సు మధ్యలో నీటిపై తేలుతూ కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఇది నీటిపై తేలుతూ ప్రయాణిస్తున్న నౌకలా కనిపిస్తుంది.
ఇప్పుడు ప్రపంచంలోనే ప్రీమియం హోటల్
ఇప్పటి తరానికి ఇది రాయల్ హోటల్‌గా మారింది. తాజ్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్యాలెస్ లో ఉండే అనుభవం నిజంగా జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకం అవుతుంది. హరివిల్లు రంగుల్లో అలంకరించిన గదులు, సరస్సు వైపు ఓపెన్ బాల్కనీలు, రాజవంశ శైలిలో రూపొందించిన అంతర్గత డిజైన్లు.. ఇవన్నీ చూసి ఎవరికైనా ఒకసారి రాజుగా పుట్టి ఉండేవాలనిపిస్తుంది!
సినిమా నేపథ్యం.. సెలబ్రిటీ స్పాట్
ఈ ప్యాలెస్ కి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది జేమ్స్ బాండ్ చిత్రం ‘Octopussy’ (1983). అప్పటి నుండి ఇది పలు బాలీవుడ్ సినిమాలకి, సెలబ్రిటీల పెళ్లిళ్లకు, ప్రైవేట్ పార్టీలకు ప్రధాన స్థలంగా మారింది. ప్రపంచంలోని ప్రముఖులు, VIPలు దీన్ని తమ ప్రత్యేక గమ్యంగా ఎంచుకుంటారు.
అక్కడి జీవితం.. అదీ రాయల్‌గానే!
ఈ ప్యాలెస్‌లోకి సాధారణంగా బోటులోనే వెళ్లాలి. ఒకసారి లోపలికి వెళ్లాక, పాత రాజమహల్‌లో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అక్కడ పనిచేసే సిబ్బంది రాజకుటుంబ సభ్యులకే సేవ చేసే శ్రద్ధతో బిహేవ్ చేస్తారు. మీరు తీసుకునే కాఫీ కూడా రాణుల తలపోయే వాతావరణంలోనే ఉంటుంది.
Also Read: AP hidden beaches: విశాఖ, భీమిలి? పక్కన పెట్టండి.. ఈ బీచ్ గురించి మీకు తెలుసా!
టూరిస్టుల జ్ఞాపకాల్లో చెరగని ముద్ర
తాజ్ లేక్ ప్యాలెస్‌లో ఉండటం అంటే.. ఉదయం నెమ్మదిగా నీటిపై సూర్యోదయం చూడటం, రాత్రికి రాజస్థానీ సంగీతం వింటూ సరస్సు ఒడ్డున డిన్నర్ చేయడం. ఇలా ఒక్కొక్క అనుభూతి కూడా ఆ భవనంతో పాటు మన మనసులోకి కలిసిపోతుంది. ముఖ్యంగా హనీమూన్ జంటలకు ఇది స్వర్గమే!
అక్కడికి ఎలా వెళ్ళాలి?
ఉదయపూర్‌కు రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో అందుబాటులో ఉంది. ఎయిర్‌పోర్ట్ నుంచి 30–40 నిమిషాల్లో తాజ్ లేక్ ప్యాలెస్ దగ్గరికి చేరవచ్చు. అయితే ముందు నుంచి బుకింగ్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న హోటల్.
ఈ తాజ్ లేక్ ప్యాలెస్ అనే అద్భుతం మనం భారతీయులమనే గర్వాన్ని కలిగించే స్థలాలలో ఒకటి. పూర్వీకుల కళా పటిమ, సాంకేతిక నైపుణ్యం, రాచరిక జీవన శైలిని చూసి ప్రతి ఒక్కరికీ.. ఇంత అందమైన స్థలమా అనిపించక మానదు. ఒకవేళ ఉదయపూర్ వెళితే, ఈ నీటి ప్యాలెస్‌ను తప్పక చూడండి.. అది ఓ కలలా అనిపిస్తుంది!