మీరు ఎప్పుడైనా తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి ట్రై చేశారా? ఒక వేళ మీకుగానీ ఆ టికెట్ బుక్ అయ్యిందంటే మీరు తప్పకుండా అదృష్టవంతులే. ఎందుకంటే.. మీరు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వాడినా సరే.. తత్కాల్ టికెట్ బుక్ చేయడం అంత ఈజీ కాదు. బుకింగ్ టైమ్ కాగానే.. ఎర్రర్స్ చూపించడం మొదలవుతుంది. జస్ట్ ‘ఒక్క నిమిషం’లోనే టికెట్లన్నీ హంఫట్ అయిపోతాయి. ఒకేసారి వేలాది మంది అవే టికెట్ల కోసం ప్రయత్నం చేయడం వల్ల.. ఈ సమస్యలు వస్తుంటాయని ఐఆర్‌సీటీసీ, రైల్వేలు మనకు ఎప్పుడూ చెప్పే కహానీలు. కానీ, దీని వెనుక ఏజెంట్లు.. ఇతరాత్ర విషయాలు దాగి ఉండవచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తత్కాల్‌లో ఏసీ టికెట్లు బుక్ చేసే టైమ్ 10. కానీ, ఆ టైమ్‌కు మీరు లాగిన్ అయినా సరే.. బుకింగ్ టైమ్ కాలేదనే మెసేజ్ వస్తుంది. ఎన్ని సార్లు బుకింగ్ ప్రెస్ చేసినా సరే అదే ఎర్రర్ చూపిస్తుంది. దీంతో కాసేపు బుర్రపాడవుతుంది. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ఫాస్టెస్ ఫింగర్ తరహాలో.. మీ వేళ్లు పనిచేసినా సరే.. టికెట్ బుక్ కాదు. అప్పటికే పుణ్యకాలం కొన్ని సెకన్లలో మాయమైపోతుంది. నిమిషం కూడా కాదు సెకన్లలోనే టికెట్లన్నీ అయిపోతాయి. ఒకేసారి లక్షలాది ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా బుకింగ్‌లకు ప్రయత్నిస్తారు. ఆ ఒత్తిడిని ఆ వెబ్ సైట్ సర్వర్ తట్టుకోలేదు. అందుకే అలాంటి ఎర్రర్స్ వస్తాయి. అలాంటివి రాకూడదంటే రైల్వే మరింత మెరుగ్గా వెబ్ సైట్‌ను రూపొందించాల్సి ఉంది. ఇటీవల మొదలుపెట్టిన రైల్ వన్ యాప్ కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. ఆ యాప్‌లో అనేక సేవలను చేర్చారు. దానివల్ల దాన్ని విజిట్ చేసే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ. ఫలితంగా ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి.
హమ్మయ్య.. నా టైమ్ బాగుంది. బుకింగ్ ఓపెన్ అయ్యిందంటూ పేరు, వయస్సు, క్యాప్చాలు అన్నీ ఎంటర్ చేసేస్తాం. కానీ, పేమెంట్ చేసేప్పుడు మాత్రం పెంట తప్పదు. అయితే.. మన బ్యాంకోడు ఎర్రర్ అంటాడు లేదా ట్రాన్సాక్షన్ ఇష్యూ అంటాడు. గిరగిరా తిరిగి.. డబ్బులైతే కట్ అవుతాయి. కానీ, ఆ సమయంలో వాడు చేసే ఆలస్యం వల్ల.. తత్కాల్ టికెట్లన్నీ వెయిటింగ్ లిస్టులోకి వెళ్లిపోతాయి. ఇక ఏం చేస్తాం. స్లీపర్ ట్రై చేద్దాం అనుకుంటారు. దానికి ఏసీ కంటే ఎక్కువ కాంటీషన్. సీట్లు తక్కువ పోటీ ఎక్కువ. అందులో నెగ్గడం అంత ఈజీ కాదు. పైగా ఓడించడానికి ఐఆర్‌సీటీసీ ఎలాగో ఎర్రర్స్ చూపిస్తుంది.
ఏజెంట్లను అడ్డుకోడానికి ఇండియన్ రైల్వే.. ఆధార్ వెరిఫికేషన్ అకౌంట్స్ అని.. అవి ఇవీ అని చాలా రూల్స్ పెడుతోంది. అయినా సరే.. దందాలకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఏజెంట్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. డబ్బులున్నవాడు ప్రీమియం తత్కాల్ టికెట్ తీసుకొని అయినా వెళ్లిపోగలడు. కానీ, సామాన్యుడి పరిస్థితి ఏమిటీ? తత్కాల్ టికెట్ అల్రెడీ ఖరీదైనది.. పైగా ఇలాంటి ఎర్రర్స్ వస్తే సామాన్యుడు ఎవరికి చెప్పుకోగలడు? అత్యవసర పరిస్థితుల్లో టికెట్ కావాలంటే ఎలా బుక్ చేసుకోగలడు? అందరూ ప్రీమియం తత్కాల్ బుక్ చేసుకోలేరు కదా? ఇప్పటికైనా రైల్వే.. ఆ ఎర్రర్స్ మీద ఫోకస్ పెట్టి సరిచేస్తుందా? లేదా ఇలాగే కొనసాగిస్తుందా? ఆ తప్పులను సరిదిద్దకపోతే.. తత్కాల్ టికెట్ ఎప్పటికీ సామాన్యుడికి అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.
Also Read: చర్లపల్లికి అమృత్ భారత్ వచ్చేస్తోంది, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆగుతుందంటే?