సాధారణంగా భారతీయ రైల్వే పర్యాటకుల కోసం భారత్ గౌరవ్ రైళ్ల ద్వారా రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. పలు పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ యాత్రలు కొనసాగుతాయి. దర్శించే పర్యాటక ప్రదేశాలను బట్టి ధరను నిర్ణయిస్తారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ అధికారులు కూడా ఇలాంటి సేవలను ప్రారంభిస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీల పేరుతో పలు పుణ్యక్షేత్రాలను తిప్పుతున్నారు. ముఖ్యంగా మంథని డిపో నుంచి పలు స్పెషల్ బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా వారాంతాల్లో పుణ్యక్షేత్రాల సందర్శన పేరుతో ప్రత్యే బస్సు సేవలను అందిస్తోంది.
జూలై 27 నుంచి కొత్త యాత్ర ప్రారంభం
మంథని బస్ డిపో నుంచి వారాంతాల్లో పుణ్యక్షేత్రాల సందర్శన యాత్ర ఈ నెల (జూలై) 27న ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం మంథని డిపో నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర.. తొలుత మేడారం సమ్మక్క సారళమ్మ గద్దెలకు చేరుకుంటుంది. అక్కడ గద్దెలను దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది. అటు నుంచి మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి బయల్దేరుతారు. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత లక్నవరం వెళ్తారు. అక్కడ కేబుల్ బ్రిడ్జి సహా పలు ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేస్తారు అక్కడి నుంచి రామప్ప ఆలయానికి వెళ్తారు. అక్కడ స్వామివారి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. అదే రోజు రాత్రి 8 గంటలకు మళ్లీ మంథనికి చేరుకుంటారు.
Read Also: థాయ్‌లాండ్‌లో బాంబుల వర్షం.. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్లడం సేఫేనా భయ్యా?
బస్సు ఛార్జీ ఎంత నిర్ణయించారంటే?
ఇక ఈ యాత్రకు వెళ్లే పర్యాటకుల కోసం సూపర్ లగ్జరీ బస్సును కేటాయించినట్లు మంథని డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ యాత్రకు సంబంధించి బస్ ఛార్జీని పెద్దలకు రూ. 800, పిల్లలకు రూ. 500గా నిర్ణయించినట్లు వెల్లడించారు. వీకెండ్ లో పుణ్య క్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తులు, పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ యాత్రకు సంబంధించిన టికెట్ బుకింగ్ వివరాల కొరకు 9959225923,9948671514 నెంబర్లకు సంప్రదించాలన్నారు. ముందస్తు రిజర్వేషన్ కోసం www,tgsrtcbus.inను సందర్శించాలన్నారు. టికెట్స్ బుకింగ్ కోసం ఫోన్ పే, గూగుల్ పే సౌకర్యం కూడా ఉందని డిపో మేనేజర్ శ్రవణ్ తెలిపారు. గత కొంతకాలంగా మంథని డిపో ప్రత్యేక యాత్రా ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ యాత్రలకు మంచి రెస్పాన్స్ రావడంతో కొత్త యాత్రా ప్యాకేజీలను ప్రకటిస్తోంది.
Read Also: సికింద్రాబాద్ నుంచి కేరళకు వెళ్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్!