Union Budget 2025: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నది. ముఖ్యంగా రైల్వేలకు కేటాయింపులు ఏమేరకు ఉంటాయోనని ఆలోచిస్తున్నది. ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్న కొత్త రైల్వే రూట్లు, రైళ్లతో పాటు అడిషన్ లైన్ల నిర్మాణానికి సుమారు రూ. 83,543 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వీటితో పాటు పలు రైళ్లు, ప్రాజెక్టులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. బడ్జెట్ లో రాష్ట్ర రైల్వేలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.
9 జిల్లాలకు రైల్వే మార్గం నిర్మించాలని విజ్ఞప్తి
తెలంగాణలో ఇప్పటి వరకు 9 జిల్లాలకు రైల్వే లైన్లు లేవు. ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు రైల్వే లైన్ నిర్మించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, సంగారెడ్డి, నిర్మల్, భూపాలపల్లి, ములుగు సహా పలు జిల్లాలో రైల్వే లైన్లు లేవు. ఈ బడ్జెట్ లో ఆయా జిల్లాలకు రైల్వే లైన్లు వేసేలా కేటాయింపులు ఉండేలా చూడాలని కోరారు.
తెలంగాణలో ప్రస్తుత రైల్వే ప్రతిపాదనలు
⦿ హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ కోసం నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
⦿ హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు MMTS రైళ్లు నడిపిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది.
⦿ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీని సర్వే గత కొంతకాలంగా కొనసాగుతున్నది.
⦿ నూతనంగా నిర్మించే రీజినల్ రింగు రోడ్డుకు అనుబంధంగా రైల్వే లైన్ నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది. దీని కోసం సుమారు రూ.12,408 కోట్లు అవసరం అవుతాయని భావిస్తున్నారు.
⦿ అటు సికింద్రాబాద్ నుంచి కాజీపేట మార్గంలో మూడో లైన్ నిర్మాణానికి సంబంధించి 2018లో రైల్వే బోర్డుకు సర్వే నివేదిక అందినా ఇప్పటికీ లైన్ నిర్మాణం పూర్తి కాలేదు.
⦿హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్లేందుకు ఇప్పుడున్న రైలు తమిళనాడు, కేరళ మీదుగా నడుస్తున్నది. అయితే, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కుక్కే సుబ్రహ్మణ్య స్టేషన్ల మీదుగా మంగళూరుకు సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
⦿హసన్‌పర్తి నుంచి భూపాలపల్లి రైల్వే లైన్ పెండింగ్‌లో ఉంది. మణుగూరు నుంచి మేడారం మీదుగా రామగుండం వరకూ కొత్త మార్గం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నా, ఇప్పటికీ ఆమోదం లేదు.
⦿ కరీంనగర్- హసన్‌పర్తి నడుమ 62 కిలో మీటర్ల మేర కొత్త ట్రాక్ నిర్మాణానికి 2011లోనే సర్వే పూర్తయ్యింది. రూ.464 కోట్లు కావాలని అంచనా వేశారు. ప్రస్తుతం ఆ అంచనా వ్యయం రూ.1,116 కోట్లు దాటినా పనులు కొనసాగడం లేదు.
⦿ వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కృష్ణా వరకూ 122 కిలో మీటర్ల రైల్వే నిర్మాణానికి 2010 జూన్‌లో సర్వేకు అనుమతి ఇచ్చారు. దీని నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.
Read Also: కిలో మీటర్ రైల్వే లైన్ నిర్మాణానికి అంత ఖర్చు అవుతుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!