Cherlapally Railway Station To Secunderabad Buses: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రోజు రోజు ప్రయాణీకులు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ చరపల్లిలో అత్యాధునిక రైల్వే స్టేషన్ ను నిర్మించింది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఈ స్టేషన్ ను తీర్చిదిద్దింది. కొద్ది నెలల క్రితమే ఈ స్టేషన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నడిచే పలు రైళ్లను చర్లపల్లికి మళ్లించారు. మరికొన్ని రైళ్లు కూడా చర్లపల్లి నుంచి నడిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే, అక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు.. సిటీలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి అదనపు బస్సులను నడిపించాలని ఆదేశించింది.
ప్రతి 10 నిమిషాలకు ఓ బస్సు
ఇకపై చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి 10 నిమిషాలకో బస్సు నడిపించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం తగిన ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. చర్లపల్లిలో కోట్లాది రూపాయలతో రైల్వే స్టేషన్ ఆధునీకరించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని రైళ్లను ఇక్కడికి మళ్లించారు. కానీ, ఇక్కడికి వచ్చి వెళ్లేందుకు ప్రయాణీకులు సరైన రవాణా వసతులు లేవు. సరిపడ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు లేవు. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల కష్టాలు తీర్చేలా, రైల్వే స్టేషన్ నుంచి ఇతర ఏరియాలకు పది నిమిషాలకో బస్సును ఏర్పాటు చేశారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి రైళ్లరాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే అధికారుల సహకారంతో రైళ్లలో వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు ప్రాంతాలకు సిటీ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు.
Read Also: ఖతార్ రోడ్లు బ్లాక్ కలర్ లో కాకుండా బ్లూ కలర్ లో కనిపిస్తాయి.. ఎందుకో తెలుసా?
ఏ ఏరియాలకు బస్సులు నడుపుతున్నారంటే?
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్, ఉప్పల్, మెహిదీపట్నం, బోరబండ, కోఠి, అఫ్జల్‌గంజ్ సహా పలు ప్రాంతాలకు ప్రతి 10 నిమిషాలకు ఓ బస్సును నడపాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని బస్సులు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి తెల్లవారు జామున 4.20 నుంచి రాత్రి 10.5 గంటల వరకు పది నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. “చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి 88 సర్వీసులు నడిపిస్తున్నాం. రైళ్ల టైమింగ్స్ ను బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. స్టేషన్ లో రైల్వే అధికారులతో సమన్వయం కోసం సూపర్ వైజర్లను నియమించాం. వారి సూచనల ప్రకారం బస్సులను నడిపిస్తాం. ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని సికింద్రాబాద్ డిప్యూటీ ఆర్‌ఎం ఆపరేషన్ జీఎన్ పవిత్ర వెల్లడించారు.
Read Also: ఖతార్ రోడ్లు బ్లాక్ కలర్ లో కాకుండా బ్లూ కలర్ లో కనిపిస్తాయి.. ఎందుకో తెలుసా?