అరబ్ కంట్రీస్ లో ఖతార్ ఒకటి. డబ్బున్న దేశం. ఇక్కడ ఉన్న ప్రధాన నగరాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దోహాలో అక్కడ సాధారణంగా బ్లూ రోడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ కావాలని రోడ్లకు నీలం రంగు వేస్తుంటారు. నల్లని రోడ్లు తక్కువగా కనిపిస్తాయి. నీలం రంగు రోడ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు మరిన్ని లాభాలను కలిగిస్తాయి. ఇంతకీ అవేటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోడ్లకు నీలం రంగు ఎందుకు వేస్తారు?
ఖతార్ లోని పలు నగరాల్లో నలుపుకు బదులుగా నీలం రంగు రోడ్లు కనిపిస్తాయి. ఈ రోడ్లు నల్లటి రోడ్ల కంటే మరింత అందంగా ఉంటాయి. అందం కంటే అసలు కారణం మరొకటి ఉంది. దోహాలో రోడ్లను నీలం రంగులో వేయడానికి ప్రధాన కారణం, తారు ఉష్ణోగ్రతను తగ్గించడం. ఇక్కడ ఎండలు విపరీతంగా ఉంటాయి. నలుపు రంగు రోడ్లు తీవ్రమైన వేడిని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల ఉష్ణోగ్రతను తగ్గించడం కోసం రోడ్లకు నీలి రంగు వేస్తారు. నీలం రంగు రోడ్లు సూర్యరశ్మిని తక్కువగా గ్రహిస్తాయి. నల్లరంగు రోడ్లతో పోల్చితే ఉష్ణోగ్రతను 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా తీసుకుంటాయి.
⦿ ఉష్ణోగ్రతను తగ్గించడం: దోహాలో వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. నీలం రంగు రోడ్లు వేడిని తక్కువగా గ్రహిస్తాయి. సో, రోడ్డు ఉపరితలం చల్లగా ఉంటుంది. ఇది ప్రజలకు, వాహనదారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. దోహాలో నీలం రంగు రోడ్లను ప్రయోగాత్మకంగా 18 నెలల పాటు పరిశీలించారు. ఈ రంగు వేడిని తగ్గించడంతో పాటు, ఈ కలర్ రేడియేషన్ ను కూడా తగ్గిస్తుందని తేలింది. ఈ నేపథ్యంలో రోడ్లకు నీలం రంగు వేయాలని నిర్ణయించింది.
⦿ మరింత ఆకర్షణీయం: నీలం రంగు రోడ్లు నల్లటి రోడ్లకంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రాత్రి సమయంలోనూ చక్కగా కనిపిస్తాయి. ఈ రోడ్లు సాధారణంగా కౌంటీ రోడ్లు, నగర రోడ్లు, ఇతర పబ్లిక్ రోడ్ల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. నీలం రంగు రోడ్లు ప్లాస్టిక్, పిచ్ తో కలిపి తయారు చేస్తారు. ఇవి నీరు మరియు వేడిని తట్టుకునేలా ఉంటాయి. ఈ రోడ్లు సాధారణంగా బ్లాక్ రోడ్లకంటే భిన్నంగా ఉంటాయి ప్రయాణీకులను మరింత ఆశ్చర్యపరుస్తాయి.
Read Also: ఇండియా నుంచి అమెరికా ప్రయాణం, జస్ట్ 18 నిమిషాల్లోనే, మస్క్ ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!
⦿ పర్యవరణహితం: నీలం రంగు రోడ్లు పర్యావరణ హితంగా ఉంటాయి. కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ రోడ్లు సాయపడుతాయని పరిశోధనలు వెల్లడించాయి. సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి వచ్చే రేడియేషన్ ను కూడా తగ్గించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఖతార్ లోని దోహాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా రోడ్లకు నీలం రంగు వేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగు కారణంగా అధిక ఉష్ణోగ్రత నుంచి టైర్లు దెబ్బ తినకుండా కాపాడుతుంది.
Read Also: సూర్యుడు అస్తమించని దేశాలు.. ఇక్కడ 24 గంటలు వెలుగే!