మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్(mahabubnagar to hyderabad) వరకు ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. పాలమూరు బస్ డిపోకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఎలాంటి హడావిడి లేకుండా ఈ బస్సులు నేరుగా ప్లాట్ ఫారమ్ వచ్చేశాయి. ట్రయల్ బేసిస్ లో ఈ బస్సులను నడుపుతున్నారు. గత శుక్రవారం నుంచి పాలమూరు- హైదరాబాద్ కు సర్వీసులు మొదలయ్యాయి. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చే వరకు ఆర్టీసీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం ప్రారంభోత్సవ వేడుక కూడా నిర్వహించలేదు. డైరెక్ట్ గా ప్లాట్ ఫారమ్ ముందు బస్సులు నిలబెట్టారు. ప్యాసింజర్లను కూడా ఎక్కించుకున్నారు.
ఒక బస్సు.. 4 ట్రిప్పులు..
ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు రోజుకు నాలుగు ట్రిప్పులు వేస్తుంది. ఒక బస్సులో 45 సీట్లు ఉంటాయి. సీట్లకు సరిపడే ప్రయాణీకులనే ఇందులో ఎక్కించుకుంటారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కు ఈ బస్ టికెట్ ఛార్జీని రూ. 180గా ఫిక్స్ చేశారు. రోజూ వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లోని ఆర్టీసీ కంట్రోల్ పాయింట్ లో అందిస్తారు.
బస్సుల మెయింటెనెన్స్ ప్రైవేట్ సంస్థకు అప్పగింత
ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్, రెస్పాన్సిబులిటీ మొత్తం ప్రైవేట్ సంస్థ చూసుకుంటుంది. ఈ 4 బస్సులు ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. మరికొద్ది రోజుల్లో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి స్టాఫ్ కూడా మొత్తం ప్రైవేట్ సంస్థకు చెందినవారే. బస్సు టికెట్ ఇవ్వడం దగ్గరి నుంచి డ్రైవింగ్ వరకు అన్నీ వాళ్లే చూసుకుంటారు. ట్రిప్స్ అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో ప్రైవేట్ డిపో లేదంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేస్తారు.
ఆర్టీసీ కార్మికుల ఆందోళన
ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన విధి నిర్వహణ, మెయింటెనెన్స్ లో ఆర్టీసీ కార్మికులను ఇన్వాల్వ్ చేయడం లేదు. కేవలం ప్రైవేట్ కంపెనీ స్టాఫ్ మాత్రమే వీటి బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులలో టెన్షన్ మొదలయ్యింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఈ పద్దతిని వ్యతిరేకిస్తున్నారు. ఈ బస్సులలో ఆర్టీసీ కార్మికులకు అవకాశం లేకుండా చేసినట్లుగానే, భవిష్యత్ లో ఆర్టీసీ మొత్తాన్ని ఇలాగే ప్రైవేట్ పరం చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో తమకు కూడా ఆ బస్సుల నిర్వహణకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాటిని విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ఇక పాలమూరు- హైదరాబాద్ మధ్య నడిచే ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బస్సు పూర్తిగా నిండకపోతే, టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణ సమయం సుమారు 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది. TGSRTC మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్‌కు పలు రకాల బస్సులను నడుపుతుంది. ఈ మార్గంలో బస్సు టిక్కెట్ ధర కనీసం రూ. 125 నుంచి ప్రారంభమవుతుంది. TGSRTC దశలవారీగా డీజిల్ బస్సులను తగ్గించి, 2,500 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ లో 254 ఎలక్ట్రిక్ బస్సులు ప్రస్తుతం నడుస్తున్నాయి.
Read Also: ఇలా చేస్తే 100 % టికెట్ కన్ఫార్మ్, లేదంటే 3 రెట్లు డబ్బు వెనక్కి!