Man Drink Neat Liquor| యవ్వనంలో అందరికీ ఫుల్ జోష్ ఉంటుంది. ప్రమాదాలంటే భయముండదు. జాగ్రత్తలు పాటించాలనే ఆలోచన అసలు ఉండదు. దూసుకుపోదామనే మనస్తత్వం మాత్రమే ఉంటుంది. కొన్ని సార్లు అది ప్రాణాంతకంగా మారుతుంది. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఒక యువకుడు స్నేహితులతో బెట్టింగ్ కాసి ఏకంగా అయిదు నీట్ లిక్కర్ బాటిళ్లు తాగేశాడు. అందులో ఏ మాత్రం నీరు, సోడా లేకుండా అతి తక్కువ సమయంలోనే వేగంగా ముగించాడు. ఆ తరువాత ఆ సాహసమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ముల్బాగల్ పట్టణానికి చెందిన 21 ఏళ్ల కార్తిక్ అనే యువకుడు ఇటీవల తన స్నేహితులతో సరదాగా షికార్లకు వెళ్లాడు. అతని స్నేహితుల్లో వెంకట రెడ్డి, సుబ్రమణి మరో ముగ్గురు ఉన్నారు. వీరంతా రెగులర్ మద్యం సేవించే అలవాటు ఉన్నవారే. గత ఆదివారం రాత్రి స్నేహితుల మధ్య సరదాగా ఎవరు ఎక్కువ మద్యం తాగ గలరు అనే అంశంపై చర్చ సాగింది. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి తన స్నేహితులకు ఒక సవాల్ విసిరాడు. ఎవరైనా సరే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ లిక్కర్ బాటిళ్లు తాగితే వారికి తాను రూ.10 వేలు ఇస్తానన్నాడు. దీంతో అందరూ ఆ సాహసం చేయాలని ఆలోచించారు. కానీ మరీ నాలుగు బాటిళ్లు తాగాలంటే అనారోగ్యం చేస్తుందని భయపడ్డారు.
అప్పుడు వెంకట్ రెడ్డి ఎవరికీ ధైర్యం లేదా? అని ప్రశ్నించాడు. దీంతో కార్తీక్ పౌరుషం పుట్టుకొచ్చింది. తాను రెడీ నంటూ ఆ సవాల్ ని స్వీకరించాడు. దీంతో వెంకట్ రెడ్డి వెంటనే పది లిక్కర్ ఫుల్ బాటిళ్లు తెప్పించాడు. కార్తీక్ కు ఒక సంవత్సరం క్రితమే వివాహమైంది. వారం రోజుల క్రితం అతని భార్య ఒక బిడ్డను ప్రసవించింది. దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కార్తీక్ ఆ డబ్బు తనకు ఉపయోగపడుతుందని భావించి ఎక్కువ మద్యం తాగే షరతుకు అంగీకరించాడు. ఆ క్షణంలో కార్తీక్ తన ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. తనకేం కాదు అనేది అతని ధీమా.
దీంతో వెంటనే నాలుగు మద్యం బాటిళ్లు ఓపెన్ చేసి నీరు కలపకుండా ఏకంగా బాటిల్ తోనే తాగడం ప్రారంభించాడు. మూడు బాటిళ్లు తాగాక అతనికి ఇబ్బందిగా మారింది. అయినా ధైర్యం చేసి నాలుగో బాటిల్ కూడా తాగాడు. ఆ తరువాత తాను నాలుగు కాదు అయిదో బాటిల్ కూడా తాగ గలను అని చెబుతూ మరో బాటిల్ పైకెత్తాడు. అంతే ఎత్తిన బాటిల్ ఆపకుండా అయిపోగొట్టాడు. ఆ తరువాత ఛాతీలో నొప్పిగా ఉందని కింద పడిపోయాడు. సుబ్రమణి, మిగతా స్నేహితులు అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే కార్తీక్ మరణించాడు. దీని గురించి ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. నాంగలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసులు విచారణ చేసి వెంకట్ రెడ్డి, సుబ్రమణి సహా మొత్తం ఆరు గురిని అరెస్ట్ చేశారు.
Also Read: 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ.. పెద్ద కథే!
ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది మద్యం తాగడం వల్ల చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ సంఖ్య ప్రతి ఏడాది సంభవించే మరణాల్లో 4.7 శాతం ఉంది.
ఇప్పుడు కార్తీక్ కుటుంబ సభ్యులు అనాథలుగా మారారు. అతని భార్య, బిడ్డ, తల్లిదండ్రులకు అండ లేకుండా పోయింది. కార్తీక్ ఆ రోజు కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఈ విషాదం జరిగేది కాదు.