Train Robbery: ఏపీలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరోసారి దొంగల టార్గెట్‌గా మారాయి. నెల్లూరు జిల్లాలో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికుల నుంచి బంగారం, నగదు అపహరించారు. దోపిడి తర్వాత ట్రైన్ నుంచి దూకి పరారయ్యారు. నిన్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల దగ్గర విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు చోరి చేశారు. ప్రయాణికుల బంగారు అభరణాలు లాక్కొని వెళ్లారు. ఇలా వరుస దోపిడీలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
అర్ధరాత్రి రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని, అంతరాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసుల నిఘా లోపంతో భద్రత కొరవడిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తరచూ రైళ్లలో దొంగతనాలు పరిపాటిగా మారాయి. రైల్వేలో భద్రత లోపం కారణంగా దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తమ చేతివాటం చూపిస్తూ రైల్వే పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు అధికశాతం రైళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అంతరాష్ట్ర ముఠాలు పథకం ప్రకారం దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఒక్కో ముఠాలో 5 నుంచి 8 మంది సభ్యులు వరకు ఉంటారు. వారిలో తప్పనిసరిగా ఒకరిద్దరు మహిళలు ఉండేలా చూసుకుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల గురించి ఆరా తీస్తారు.
ప్రయాణికులు నిద్రలోకి జారుకోగానే ముఠాలు బెర్తుల కింద ఉన్న బ్యాగులు, చేతి సంచులు, సెల్‌ఫోన్లు వంటి విలువైన వస్తువులు కాజేసి రైలు వేగం తగ్గగానే కిందకు దూకుతారు. కొన్నిసందర్భాల్లో చైన్ లాగి పారిపోతారు. దొంగతనం చేశాక ముఠా సభ్యులంతా ఎక్కడ కలవాలో ముందే నిర్ణయించుకుంటారు. కొల్లగొట్టిన సొమ్ముతో కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
రైల్వే శాఖ స్పందన
ఈ ఘటనలపై రైల్వే శాఖ అప్రమత్తమైంది. గగన్‌హెడ్‌లు, ఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించి, రాత్రి పూట మరింత పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రయాణికులకు హెచ్చరిక
ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రివేళల్లో ప్రయాణించే వారు.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువులు చూపించేలా ఉంచకూడదు. అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read: ఇండియన్ రైల్వేలో కొత్త ఫీచర్.. మీకు నచ్చిన సీటును మీరే ఎంచుకోండి!
ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.