Stone Attacks on Trains: భారతీయ రైల్వే చట్టాల్లోని శిక్షలు చాలా సీరియస్ గా ఉంటాయి. ఒక్కసారి రైల్వే చట్టం కింద కేసు నమోదైతే జీవితం ఆగమైనట్టే. అందుకే రైల్వే ప్రయాణీకులను భయాందోళనకు గురి చేయడం, రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం లాంటి పనులకు పాల్పడితే, కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. ఒక్కోసారి పదేళ్ల నుంచి జీవిత ఖైదు పడుతుంది కూడా.
ఇటీవల చెన్నై పరిసర ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడులు పెరిగాయి. చెన్నై బీచ్–తాంబరం, చెన్నై–అరక్కోణం, చెన్నై–గుమ్మిడిపూండి మార్గాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. అంతేకాకుండా, అత్యాధునిక రైళ్లు అయిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై కూడా రాళ్లు విసిరిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఘటనలకు ప్రధాన కారణం రైల్వే ట్రాక్‌ల దగ్గర ఆడుకునే పిల్లలతో పాటు కొంతమంది అసాంఘిక వ్యక్తులు కారణం అయినట్లు అధికారులు వెల్లడించారు. రాళ్లు విసరడం వల్ల రైలు కిటికీలు పగిలిపోవడం మాత్రమే కాకుండా, ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయిన సందర్భాలున్నాయి. కొన్ని సందర్భాల్లో కంటి చూపు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.
ఇలాంటి ఘటనలు ఎక్కువగా సాయంత్రం, రాత్రి సమయంలో జరుగుతున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో, ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల్లో భయం పెరుగుతోందన్నారు. వందే భారత్ లాంటి రైళ్లకు నష్టం కలగడం వల్ల రైల్వే శాఖకు లక్షల రూపాయల నష్టం జరుగుతోంది.
రైల్వే చట్టం ప్రకారం, రైళ్లపై రాళ్లు విసరడం లాంటి చర్యలతో ప్రయాణికుల భద్రతకు ప్రమాదం కలిగిస్తే కఠిన శిక్షలు తప్పవు. రాళ్లు తగిలి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే మరింత కఠినమైన శిక్షలు కూడా విధించే అవకాశం ఉంది. రైళ్లపై రాళ్లు విసరడం చాలా తీవ్రమైన నేరమని రైల్వే అధికారులు చెప్తున్నారు. రైల్వే యాక్ట్, 1989 ప్రకారం, ఈ కేసుకు 10 ఏళ్లు లేదంటే జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. అందుకే, రైళ్లపై రాళ్లు వేసే వాళ్లు, వేయాలనుకునే వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. కాదని తప్పు చేస్తే, జైల్లో జీవితాంతం ఊచలు లెక్కించకతప్పదన్నారు.
Read Also: రైల్వే టికెట్ బుకింగ్ స్కామ్.. ఆ 15 సెకన్లలో ఏం జరుగుతుందంటే?
రైళ్లపై దాడులను అరికట్టేందుకు చెన్నై రైల్వే డివిజన్ పలు రకాలు చర్యలు చేపట్టింది. ట్రాక్‌ల వెంట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, డ్రోన్లతో నిఘా పెట్టడం, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు చేపడుతున్నది. రైళ్లపై రాళ్లు విసరడం ఒక ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన పని అని వివరిస్తున్నది. ప్రజలు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని సూచిస్తోంది. ఏవైనా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతోంది.
Read Also: ప్రకృతి అందాల నడుమ 180 డిగ్రీ వ్యూ.. విస్టాడోమ్ ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి బ్రో!