Oldest Trains In India: భారతీయ రైల్వేకు ఎన్నో ఏండ్ల చరిత్ర ఉంది. ఇండియాలో రైల్వే వ్యవస్థ పురుడుపోసుకుని 188 సంవత్సరాలు అవుతోంది. దేశంలో తొలి రైలు 1837లో పట్టాలెక్కింది. 1853 నుంచి ప్రయాణీకులు జర్నీ చేయడం మొదలుపెట్టారు. దశాబ్దాలుగా రైల్వే సంస్థ అభివృద్ధి చెందుతూ వస్తున్నది. కోట్లాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నది. దేశంలో ఇప్పటికీ పలు పురాతన రైళ్లు సేవలను అందిస్తున్నాయి. ఇంతకీ ఆ రైళ్లు ఏవి? ఏ రూట్లలో సేవలు అందిస్తున్నాయనే విషయాలను తెలుసుకుందాం..
⦿ కల్కా మెయిల్: భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత పురాతనమైన రైళ్లలో కల్కా మెయిల్ ఒకటి. కొద్ది రోజుల క్రితమే ఈ రైలు 158వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ ఐకానిక్ రైలు జనవరి 1, 1866న ఈస్ట్ ఇండియన్ రైల్వే మెయిల్ పేరుతో పట్టాలెక్కింది. ఇది హర్యానాలోని కల్కా, బెంగాల్ లోని హౌరా మధ్య సేవలు అందిస్తున్నది.
⦿బాంబే-పూనా మెయిల్: ముంబై- పూణే మధ్య తొలి ఇంటర్ సిటీ రైలుగా పట్టాలెక్కింది. 1863లో దీనిని ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఈ రైలు తన సేవలను కొనసాగిస్తున్నది.
⦿ఫెయిరీ క్వీన్: ఇది 1855లో ప్రారంభించబడిన స్టీమ్ లోకోమోటివ్. ప్రపంచంలోని పురాతనమైన ఆపరేటింగ్ స్టీమ్ లోకోమోటివ్‌లలో ఒకటి. ఈ రైలు న్యూఢిల్లీ- అల్వార్ మధ్య నడుస్తుంది. ఫెయిరీ క్వీన్ మొత్తం రెండు కోచ్‌ల ను కలిగి ఉంటుంది. 50 మంది ప్రయాణికులను తీసుకెళ్తుంది. 1998లో ఈ రైలు పురాతనమైన స్టీమ్ లోకోమోటివ్ గా గిన్నిస్ రికార్డు సాధించింది.
⦿డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (టాయ్ ట్రైన్): దీనిని 1881లో ప్రారంభించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ రైలు డార్జిలింగ్ కొండల గుండా ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
⦿కల్కా-సిమ్లా రైల్వే: 1903లో ఈ రైలు ప్రారంభం అయ్యింది. ఈ రైలు కల్కా నుంచి సిమ్లా వరకు హిమాలయ పర్వత మార్గం ద్వారా అద్భుతమైన ప్రయాణాలను అందిస్తోంది.
⦿నీలగిరి మౌంటైన్ రైల్వే: ఇది 1908లో ప్రారంభం అయ్యింది. ఇది తమిళనాడు మైదానాలతో పాటు నీలగిరి కొండలను కలుపూ ప్రయాణం చేస్తుంది. ఈ రైలు కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకుంది.
⦿పంజాబ్ మెయిల్: పంజాబ్ మెయిల్ 1912లో తన సేవలను మొదలు పెట్టింది. ఇది ముంబై- ఫిరోజ్ పూర్ మధ్య నడుస్తుంది. నిత్యం ఎంతో మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంది.
⦿ఫ్రాంటియర్ మెయిల్: ఈ ఐకానిక్ రైలు 1928లో అందుబాటులోకి చ్చింది. బ్రిటిష్ పాలనలో అత్యంత ప్రసిద్ధి చెందిన రైళ్లలో ఒకటి. ఇందులో ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం ఉండేది. 1996లో దీని పేరు గోల్డెన్ టెంపుల్ ఎక్స్ ప్రెస్‌గా పేరు మార్చారు.
⦿గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్: ఈ రైలు భారతదేశంలోని పురాతన రైళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రైలు ప్రారంభంలో పాక్ లోని పెషావర్ నుంచి మంగళూరు వరకు నడిచేది. ప్రస్తుతం ఈ రైలు ఢిల్లీ-మద్రాస్ మార్గంలో నడుస్తున్నది.
⦿దక్కన్ క్వీన్: ఇది 1930లో ప్రవేశపెట్టబడింది. పూణే- ముంబై మధ్య సేవలు అందిస్తున్నది. దక్కన్ క్వీన్ దేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు.
Read Also: డబ్బులు లేకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఇండియన్ రైల్వే సూపర్ సర్వీస్ గురించి మీకు తెలుసా?