Dil Raju About IT Raids: టాలీవుడ్ బడా నిర్మాత అయిన దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు జరగడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలుగా బ్లాక్ మనీ ఉన్నవారిపైనే ఐటీ దాడులు జరుగుతాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే దిల్ రాజు కూడా ఏమైనా తప్పు చేశాడా అంటూ నాలుగు రోజుల పాటు సోషల్ మీడియాలో చర్చలు సాగాయి. ఫైనల్‌గా ఐటీ రైడ్స్ ముగిశాయి. అసలు ఇలా ఎందుకు జరిగింది అనే విషయాన్ని అందరికీ వివరించడం కోసం దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో తన ఇంట్లో ఐటీ రైడ్స్ ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అనే విషయాన్ని వివరించారు. అంతే కాకుండా తన తల్లి ఆరోగ్యంపై కూడా క్లారిటీ ఇచ్చారు.
నిజాలు కాదు
‘‘నాలుగు రోజులు నుండి ఐటీ రైడ్స్ జరిగాయి. నేను సెలెబ్రిటీ కాబట్టి మీడియా అంతా నా మీద ఫోకస్ చేసింది’’ అంటూ అసలు నాలుగు రోజుల పాటు ఐటీ రైడ్స్ ఎలా జరిగాయి అనే విషయాన్ని వివరించారు దిల్ రాజు. 2008లో కూడా ఒకసారి ఇలాగే రైడ్ జరిగిందని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ రైడ్స్ లాంటివి జరగలేదని, ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడే జరిగిందని తెలిపారు. తన ఇల్లు, ఆఫీస్‌లో సెర్చ్ చేసిన ఐటీ అధికారులు అన్ని స్టేట్మెంట్స్ తీసుకున్నారని అన్నారు. తన దగ్గర డబ్బు, డాక్యుమెంట్స్ తీసుకున్నారని కొన్ని మీడియా ఛానెల్స్ ప్రసారం చేశాయని, అవన్నీ నిజాలు కాదని తేల్చిచెప్పారు.
ఆశ్చర్యపోయిన ఐటీ డిపార్ట్మెంట్
ఐటీ అధికారులు.. తన దగ్గర రూ.5 లక్షలు, శిరీష్ దగ్గర రూ.4.50 లక్షలు తీసుకున్నారని దిల్ రాజు బయటపెట్టారు. ‘‘నా దగ్గర నుండి ఏదో ఊహించామంటూ ఐటీ డిపార్ట్మెంట్ సైతం ఆశ్చర్యపోయింది. రైడ్ జరుగుతున్నప్పుడు మా అమ్మకు దగ్గు వస్తే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ ఆమెకు హార్ట్ అటాక్ అని కొంతమంది రాశారు. నన్ను ఎవరు టార్గెట్ చేయలేదు. ఐటీ దాడులు అందరి మీద జరిగాయి. మా వద్ద డబ్బు, డాక్యుమెంట్స్ దొరికాయని వార్తలు వేశారు కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో వార్తలు వేశారు. కానీ అంతా కలిపి రూ.20 లక్షల లోపు మాత్రమే ఉన్నాయి. అయిదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడా పెట్టుబడి పెట్టలేదు’’ అని వివరించారు దిల్ రాజు (Dil Raju).
Also Read: సైఫ్ పై దాడి.. కరీనా హస్తం ఉందా.. అనుమానం రేకెత్తిస్తున్న అంశాలు..!
తీరు మార్చుకుంటాం
‘‘24 క్రాఫ్ట్స్‌లో లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారు. పైనల్‌గా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చెక్ చేశారు. అంతా క్లీన్‌గా ఉందన్నారు. అమ్మకు లంగ్ ఇన్ఫెక్షన్‌కు చికిత్స జరిగింది. దయచేసి మా మీద తప్పుడు వార్తలు వేయొద్దు. మా మీద సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయ్యింది. ఎక్కువగా ఊహించుకోవద్దు. ఎలాంటి హాడావుడి లేదు. ఇండస్ట్రీ లో అంతా ఆన్‌లైన్‌లో బుకింగ్, ఆన్‌లైన్ లావాదేవీలే జరుగుతున్నాయి. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయి. కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించడంపైద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడతాం. అది తప్పు. తీరు మార్చుకొవాల్సిందే. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారు. ఆడిటర్స్ వెళ్లి కలుస్తారు.’’ అని తెలిపారు దిల్ రాజు.