Top 5 Cool Hill Stations In India: సమ్మర్ వచ్చిందంటే, ఎండలు మండిపోతాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఫ్యామిలీతో కలిసి అలా కూల్ ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటారు. పిల్లలకు కూడా హాలీడేస్ ఉండటంతో చాలా మంది సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తుంటారు. సౌత్ ఇండియాలో సమ్మర్ లో చల్లటి ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి కొన్ని క్రేజీ హిల్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. చల్లని వాతావరణంతో స్వర్గంలా అనిపిస్తాయి. 15–25°C మధ్య ఉష్ణోగ్రత, పచ్చని కొండలు, స్వచ్ఛమైన గాలి మంచి రిలాక్స్ ట్రిప్ ఇస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి రైలులో ఈ ప్రాంతాలకు ఈజీగా వెళ్లొచ్చు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అరకు లోయ ప్రకృతి ప్రేమికులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ పచ్చని కొండలు, కాఫీ తోటలు, జలపాతాలు ఎంతో ఆకట్టుకుంటాయి. బొర్రా గుహలు, కటికి జలపాతం, గిరిజన సంస్కృతి టూరిస్టులను బాగా ఆకట్టుకుంటాయి. విశాఖపట్నం నుంచి అరకుకు రైలు ప్రయాణం మంచి అనుభూతిని కలిగిస్తుంది. సొరంగాలు, వంతెనలు, అడవులు మధ్య ప్రయాణం చాలా అందంగా ఉంటుంది.
తమిళనాడులోని ఊటీ చల్లని వాతావరణం, టీ తోటలతో బాగా ప్రసిద్ధి చెందింది. ఊటీ సరస్సులో బోటింగ్, బొటానికల్ గార్డెన్స్ సందర్శన, దొడ్డబెట్ట పర్వతం నుంచి అందమైన వ్యూస్ చూసే అవకాశం ఉంటుంది. నీలగిరి టాయ్ ట్రైన్ ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కోయంబత్తూరు వరకు రైల్లో వెళ్లి, అక్కడి నుంచి రోడ్ ద్వారా సులభంగా వెళ్లొచ్చు.
తమిళనాడులోని కొడైకనాల్ నిశ్శబ్దంగా, చల్లని గాలి, అడవులతో నిండి ఉంటుంది. కొడై సరస్సు దగ్గర బోటింగ్, కూకర్స్ వాక్ లో నడక, పిల్లర్ రాక్స్ లాంటి ప్రదేశాలు చూడవచ్చు. కుటుంబంతో లేదంటే ఫ్రెండ్స్ తో రిలాక్స్ అయ్యేందుకు బెస్ట్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు. కొడై రోడ్ వరకు రైల్లో వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు లేదంటే టాక్సీలో వెళ్లొచ్చు.
కేరళలోని మున్నార్ పచ్చని టీ తోటలతో ప్రసిద్ధి. ఎరవికుళం నేషనల్ పార్క్ లో అరుదైన జంతువులు, మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్ వంటి ప్రదేశాలు చూడవచ్చు. ఇక్కడి చల్లని వాతావరణం, కొండల అందాలు ఎంతో ప్రశాంతత ఇస్తాయి. ఎర్నాకుళం వరకు వరకు రైలు ప్రయాణం, అక్కడి నుంచి రోడ్ ద్వారా మున్నార్ కు చేరుకోవచ్చు.
తమిళనాడు లోని యెర్కాడ్ తక్కువ రద్దీగా ఉండే, ప్రశాంతమైన ప్రదేశం. కాఫీ తోటలు, సరస్సు, లేడీస్ సీట్ వ్యూపాయింట్, కిళ్ళియూర్ జలపాతం అద్భుతంగా ఆకట్టుకుంటాయి. సేలం వరకు రైల్లో వెళ్లాలి. అక్కడి నుంచి ఈజీగా యెర్కాడ్ చేరుకోవచ్చు.
వేసవిలో ముఖ్యంగా మార్చి నుంచి జూన్ మధ్య ఈ ప్రదేశాలను చూడటం మంచిది. ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.