అమెరికాలోని నార్త్ నార్త్ డకోటాలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 100 కిలో మీటర్లకు పైగా వేగంతో వీచిన సుడిగాలులు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఎండర్లిన్ అనే చిన్న పట్టణంలో తీవ్రమైన సుడిగాలి పెను విధ్వంసం సృష్టించింది. ఈ తీవ్రమైన గాలుల కారణంగా ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది.
శుక్రవారం అర్థరాత్రి సమయంలో సుడిగాలుల బీభత్సం
శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటలకు ఎండర్లిన్ లో సుడిగాలుల బీభత్సం మొదలయ్యింది. 100 కిలో మీటర్లకు పైగా వేగంతో వీచిన సుడిగాలులకు పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు చనిపోయారు. టోర్నడో బీభత్స తర్వాత సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద మృతదేహాలను వెలికితీశారు.
పట్టాల మీది నుంచి ఎగిరిపోయిన రైళ్లు
తరచుగా నార్త్ డకోటాలో సుడిగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గంటకు 105 కిలో మీటర్ల వేగంతో వీచే సుడిగాలుల కారణంగా పెను ముప్పు వాటిల్లుతోంది. రైలు, కార్లు గాలికి ఎగిరిపోయాయి కూడా. తాజాగా సుడిగాలుల తీవ్రతకు ఏకంగా రైళ్లు పట్టాల మీది నుంచ తిరిగి పడ్డాయి. పలు వాహనాలు గాలిలోకి ఎగిరిపోయాయి. తీవ్రమైన గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి.
ముమ్మరంగా సహాయక చర్యలు
అటు రైళ్లు పడిపోవడం, కార్లు ఎగిరిపోవడం, ఇళ్లు ధ్వంసం కావడంతో నార్త్ డకోటాలో టోర్నోడో బీభత్సం సృష్టించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్లు తెలిపారు. మరికొంత మంది గాయపడినట్లు వెల్లడించారు. రైళ్లు పడిపోవడం వల్ల పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలిగినట్లు తెలిపారు. రైల్వే అధికారులు పట్టాలు తప్పిన రైళ్లను తొలగించి, మళ్లీ రైళ్లను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. మరోవైపు టోర్నడో బీభత్సం కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Read Also: ట్రైన్ మిస్ చేశారా? వెంటనే TDR ఫైల్ చెయ్యండి.. కొత్త రూల్స్ ఇవే!
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
తాజాగా నార్త్ డకోటాలో టోర్నడోల బీభత్సానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారీ సుడిగాలి పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్లు ఈ వీడియోల్లో కనిపిస్తోంది. గాలి తీవ్రతకు రైళ్లు పడిపోవడం సహా ఇళ్లు ధ్వంసం అయినట్లు ఈ వీడియోల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియోలను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాపం ఎండర్లిన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలను ఊహించుకుంటేనే హృదయం విలవిలలాడుతోందంటున్నారు. ఇప్పటి వరకు సుడిగాలికి రైళ్లు పడిపోగా ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ పెడుతున్నారు.