Darjeeling Toy Train: భారతీయ రైల్వే వ్యవస్థలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రైలు డార్జిలింగ్ టాయ్ ట్రైన్. న్యూజల్ పైగురి నుంచి డార్జిలింగ్ వరకు సుమారు 87 కిలో మీటర్ల మేర తన సర్వీసులను నడుపుతున్నది. ముఖ్యంగా పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించేందుకు ఈ రైల్లో ప్రయాణించి ఎంజాయ్ చేస్తుంటారు.
4 నెలల తర్వాత టాయ్ ట్రైన్ సేవలు పునఃప్రారంభం
సుమారు నాలుగు నెలల అంతరాయం తర్వాత డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (DHR) సంస్థ మళ్లీ టాయ్ ట్రైన్ సేవలను ప్రారంభించింది. న్యూ జల్‌పైగురి స్టేషన్ నుంచి రైలు సేవలను మొదలు పెట్టింది. జులై 5న ఈ రైల్వే ట్రాక్ మీద కొండ చరియలు విరిగిపడ్డాయి. ట్రాక్ దెబ్బతినడంతో రైలు సేవలు నిలిపివేశారు. తాజాగా ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో టాయ్ ట్రైన్ మళ్లీ తను సర్వీసులను మొదలు పెట్టింది. ఈశాన్య సరిహద్దు రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ కతిహార్ సురీందర్ కుమార్ జెండా ఊపి ఈ రైలు సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “DHR టాయ్ ట్రైన్ సేవలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రైలు రెగ్యులర్ సర్వీసులను ప్రారంభించే ముందు కొత్త ట్రాక్స్ మీద ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నాం. ఆ తర్వాతే ప్రయాణీకులను అనుమతిస్తాం. త్వరలో మూడు ఇంజిన్లను అందుబాటులోకి తీసుకొస్తాం” అన్నారు.
ట్రయల్ రన్ నిర్వహించిన ఆస్ట్రేలియన్ లోకో పైలెట్
ఇక ఈ టాయ్ ట్రైన్ నడపడానికి ఆస్ట్రేలియా నుంచి జోసెఫిన్ క్రెస్ వెల్ అనే లోకో పైలెట్ వచ్చింది. ఆమె తాత జార్జ్ బెక్ బెన్ క్రెస్‌వెల్ ( 1906 నుంచి 1916 వరకు DHR జనరల్ మేనేజర్ గా పని చేశారు. “మా తాత జనరల్ మేనేజర్ గా ఉన్న టాయ్ ట్రైన్ నడిపించడం సంతోషంగా ఉంది. మా తాత చరిత్రను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం లభించింది. ఈ రైలుకు UNESCO గుర్తింపు రావడం సంతోషకరంగా ఉంది. ఈ రైలుకు ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలి. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించాలి. ఈ టాయ్ ట్రైన్ మళ్లీ ఎక్కేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు” అని చెప్పుకొచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్(యునెస్కో) 1999లో DHRని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
డార్జిలింగ్ టాయ్ ట్రైన్ ప్రత్యేకత
ప్రాచీన రైల్వే మార్గాల్లో డార్జిలింగ్ హిమలయన్ రైల్వే టూర్ ఒకటి. 1881 నుంచి న్యూ జల్ పైగురి- డార్జిలింగ్ నడుమ సుమారు 87 కిలో మీటర్ల మేర ఈ టాయ్ ట్రైన్ సేవలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయాణం పూర్తి కావడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. మార్గ మధ్యంలో దేశంలోనే అత్యంత ఎత్తైన ఘుమ్ రైల్వే స్టేషన్ ఉంది. దీని ఎత్తు సముద్ర మట్టానికి 7000 అడుగులు హైట్ లో ఉంటుంది. లోయలు, గుహల నుంచి సాగే ఈ ప్రయాణం పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Read Also: భారతీయ రైల్వేలో M1 కోచ్ వెరీ స్పెషల్, ఇంతకీ దీని ప్రత్యేక ఏంటో తెలుసా?