BIG TV LIVE Originals: రైళ్లు పట్టాల మీద కాకుండా రోడ్ల మీద ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? కార్లు, బైకులు, బస్సులతో పాటు రైళ్లు కూడా కలిసి వెళ్తే? ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా? నిజానికి కొన్ని దేశాల్లో రైళ్లు రోడ్ల మీదే పరిగెడుతాయి. ఇంతకీ అవి, ఎలా ప్రయాణిస్తాయి? ఏ దేశాల్లో రోడ్ల మీద నడిచే రైళ్లు ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రోడ్ల మీద పరిగెత్తే రైళ్లు
ఈ రైళ్లు రోడ్ల మీదే పరిగెట్టినప్పటికీ, ట్రాక్స్ మాత్రం నిర్మించి ఉంటాయి. సొంత ట్రాక్‌లను కలిగి ఉన్న సాధారణ రైళ్ల మాదిరిగా కాకుండా, ఈ రైళ్లు రోడ్డు మీదే ఇతర వాహనాలతో కలిసి ప్రత్యేకమైన ట్రాక్ మీద ప్రయాణం చేస్తుంటాయి. ఇతర ప్రయాణీకులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ రైళ్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి. ఈ రైళ్లు రోడ్లు దాటే సమయంలో ట్రాఫిక్ ను ఆపివేస్తారు. అయితే, ఈ ప్రత్యేకమైన సెటప్ చాలా అరుదు అయినప్పటికీ, కొన్ని దేశాలలో చూడవచ్చు.
రోడ్ల మీదే రైళ్లు నడిచే నడిచే దేశాలు
⦿ ఇండోనేషియా
సెంట్రల్ జావాలోని సురకార్తాలో రోడ్డు మీదే ప్రయాణించే రైలు ఉంటుంది. బటారా క్రెస్నా రైల్ బస్ అనే రైలు రద్దీగా ఉండే జలాన్ స్లామెట్ రియాడి నగర వీధుల్లో నడుస్తుంది. అదే రోడ్డులో సేపూర్ క్లుతుక్ జలదార అనే టూరిస్ట్ స్టీమ్ రైలు కూడా నడుస్తుంది. రైలు రోడ్డు మీదికి వచ్చిన సమయంలో ఆ మార్గంలో ప్రయాణించే కార్లు, బైక్‌లు పక్కకు తప్పుకుంటాయి.
⦿ జర్మనీ
జర్మనీలోని డార్మ్ స్టాడ్ట్ లో ఒకప్పుడు సరుకు రవాణా రైలు మార్గం రోడ్డు మీదుగాఉండేది. ఇప్పుడు దాన్ని అంతగా ఉపయోగించడం లేదు. బౌట్జెన్ లోని ఫ్యాబ్రిక్ స్ట్రాస్సేలో ఒక చిన్న రైలును ఫ్యాక్టరీకి వస్తువులను డెలివరీ చేయడానికి రోడ్డు మీదే నడుపుతున్నారు. ఈ రైళ్లు వచ్చే సమయంలో ఇతర వాహనాలు పక్కకు జరుగుతాయి.
⦿ జపాన్
జపాన్‌లోని కీహాన్ కీషిన్, ఎనోడెన్ ఎనోషిమాలో వీధుల్లో నడిచే రైళ్లు కనిపిస్తాయి. ఈ రైళ్లు ట్రామ్ ల మాదిరిగా కనిపిస్తాయి. ఈ రైళ్లు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా నెమ్మదిగా ప్రయాణిస్తాయి.
⦿ న్యూజిలాండ్
న్యూజిలాండ్ లోని కవాకావాలో.. బే ఆఫ్ ఐలాండ్స్ వింటేజ్ రైల్వే స్టేట్ హైవే 1 లోనే నడుస్తుంది. ఈ పర్యాటక రైలు పట్టణం మధ్యలోని రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. హిండన్ లో మరొక రైలు ఏకంగా వంతెన మీదుగా ముందుకు వెళ్తుంది.
⦿ స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో భారీ గూడ్స్ రైళ్లు జహ్న్‌రాడ్ స్ట్రాస్సే లాంటి వీధుల్లో ప్రయాణిస్తాయి. రైస్ మిల్లులకు ధాన్యాన్ని వేగంగా తీసుకెళ్లేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్డ మీదే ఈ రైళ్లు కొనసాగుతాయి.
⦿ పోలాండ్
పోలాండ్ లోని కోలోబ్రెగ్‌లో రైళ్లు సుమారు కిలో మీటర్ వేమ రోడ్డు మీద పోర్ట్ కు సరుకును తీసుకువెళతాయి. కొన్నిసార్లు ప్యాసింజర్ రైళ్లు ప్రత్యేక ప్రయాణాల కోసం ఈ మార్గాన్ని ఉపయోగిస్తాయి.
⦿ యునైటెడ్ కింగ్‌డమ్
UKలోని పోర్త్ మాడోగ్ లో, వెల్ష్ హైలాండ్, ఫెస్టినియోగ్ రైల్వేలు బ్రిటానియా వంతెనపై ఒక చిన్న రోడ్డును పంచుకుంటాయి. రైలు దాటే సమయంలో రైల్వే క్రాసింగ్ దగ్గర కార్లు ఆగిపోతాయి.
⦿ థాయిలాండ్, లావోస్
మెకాంగ్ నది మీద ఉన్న థాయ్ లావో వంతెనపై రైళ్లు, కార్లు వెళ్తుంటాయి. అయితే, రైళ్లు ప్రయాణించే సమయంలో కార్డు ఆగిపోతాయి.
⦿ యునైటెడ్ స్టేట్స్
ఇండియానాలోని మిచిగాన్ లో రైళ్లు 11వ వీధిలో నడిచేవి. ఈ రైళ్లు 2022 వరకు కార్లతో కలిసి నడిచేవి. ఇది USలో చివరి వీధిలో నడిచే రైల్వే స్టేషన్. ఇప్పుడు దాని స్థానంలో కొత్త స్టేషన్ వచ్చింది.
రోడ్ల మీద రైళ్లు ఎందుకు నడుస్తాయి?
రద్దీగా ఉండే నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక రైల్వే ట్రాక్‌లను నిర్మించడం కష్టం. అందుకే, రోడ్ల మీద నడిచే రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్యాక్టరీలకు, పోర్టులకు వస్తువులను తరలించడంతో పాటు పర్యాటకులను ఆయా నగరాల్లో తిప్పేందుకు వీటిని నడిపిస్తున్నారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించకుండా ఈ రైళ్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.