సాధారణంగా ఓ వ్యక్తి చెప్పిన విషయం నిజం అయితే, జనాలు అతడు చెప్పిన మాటలను కచ్చింగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసమే ఇప్పుడు జపాన్ పర్యాటక రంగాన్ని గట్టి దెబ్బ కొట్టింది. ఓ పుస్తకంలో చెప్పిన విషయాన్ని పట్టుకుని పర్యాటకులు జపాన్ కు వెళ్లడమే మానేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఏకంగా 50 శాతం మంది పర్యాటకులు తగ్గిపోయారు. ఇంతకీ జపాన్ కు పర్యాటకులు వెళ్లకపోవడానికి, ఆ పుస్తకానికి ఉన్న లింకేంటి? ఆ పుస్తకంలో ఏం చెప్పారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పర్యాటకులను భయపెట్టే ఆ పుస్తకంలో ఏముంది?
జపాన్ వెళ్లే పర్యాటకుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ పుస్తకం పేరు ‘ది ప్యూచర్ ఐ సా’. ఇదో కామిక్ నవల. ఈ పుస్తకంలో చెప్పిన కొన్ని విషయాలను నమ్మి పర్యాటకులు జపాన్ కు వెళ్లడం లేదు. రియో టాట్సు అనే రచయిత, 1999లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో భవిష్యత్ లో జరగబోయే పలు ప్రకృతి విపత్తుల గురించి ప్రస్తావించారు. జులై 2025లో భారీ భూకంపం, సునామీ జపాన్ ను ముంచెత్తే అవకాశం ఉందని ఈ పుస్తకంలో రాశారు. ఈ నేపథ్యంలో జపాన్ కు వెళ్లకూడదని పర్యాటకులు భావిస్తున్నారు.
50 శాతం తగ్గిన పర్యాటకుల సంఖ్య
బ్లూమ్ బెర్గ్ ఇంటెలిజెన్స్ విశ్లేషణ ప్రకారం.. దక్షిణ కొరియాలోని తైవాన్ నుంచి ఎయిర్ లైన్ బుకింగ్ లు ఏప్రిల్ నుంచి భారీగా తగ్గాయి. హాంకాంగ్ విమానాలు గత సంవత్సరం కంటే సగటున 50 శాతం తగ్గాయి. జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం వరకు వీక్లీ బుకింగ్‌లు కూడా 80 శాతానికి పైగా తగ్గాయని నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ, అధికారులు పర్యాటకులను పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. శాస్త్రవేత్తలు ప్రస్తుత శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి భూకంపాలకు సంబంధించి కచ్చితమైన సమయాలు, దాని తీవ్రతను అంచనా వేస్తున్నారని వెల్లడించారు.
ఏప్రిల్ లో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగినా..
జపాన్ టూరిజం ఇండస్ట్రీలో బలంగా ఉంది. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 3.9 మిలియన్ల మంది విదేశీ సందర్శకులు జపాన్ లో పర్యాటించారు. కానీ, భూకంప ఊహాగానాలు జపాన్ పర్యాటకంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నెమ్మదిగా ఈ ప్రభావం పెరుగుతున్నట్లు బ్లూమ్ బెర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక తేల్చి చెప్పింది. 2011లో గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీతో సహా ఇతర ప్రకృతి వైపరీత్యాలను టాట్సు అంచనా వేశారు. అవి నిజం కావడంతో 2025లోనూ సునామీ అల్లకల్లోలం సృష్టిస్తుందనే అంచనాలను నమ్ముతున్నారు. అంతేకాదు, ఈ హెచ్చరికలకు తగినట్లుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఆ పుస్తకంలో చెప్పినట్లు జూలై 2025 సమీపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మరోవైపు ఓ వ్యక్తి చెప్పిన విషయం ఒకసారి నిజం అయినంత మాత్రాన, ప్రతిసారి నిజం కావాల్సిన అవసరం లేదంటున్నారు మరికొంత మంది. ప్రజలు, పర్యాటకులు అనసవరంగా పానిక్ కావద్దంటున్నారు. టూరిస్టులు మాత్రం రిస్క్ తీసుకోవడం ఎందుకని జపాన్ కు వెళ్లడం మానేస్తున్నారు.
Read Also: కుక్కలపై ప్రేమ.. అసలు కథ తెలిసి అంత షాక్, ఇదేం అలవాటే తల్లి!