12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు యావత్ ఆధ్యాత్మిక ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ వేడుక కోసం ప్రయాగ్ రాజ్ వేదికగా కుంభమేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 13 నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 26 వరకు జరగనున్నాయి. సుమారు 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో పాల్గొనేందుకు హిందువులంతా రెడీ అవుతున్నారు. పవిత్ర తివేణీ సంగమం దగ్గర పుణ్యస్నానాలు చేసి పునీతులు అయ్యేందుకు బయల్దేరుతున్నారు.
45 కోట్ల మంది మహా కుంభమేళాలో పాల్గొనే అవకాశం
దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళా నిర్వహణ కోసం యోగీ సర్కారు రూ.7500 కోట్లు కేటాయించింది. 50 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఏఐ టెక్నాలజీతో కూడిన వార్ రూమ్ ను ఏర్పాటు చేసి కుంభమేళా జరిగే ప్రాంతం మీద నిఘా ఏర్పాటు చేశారు. కుంభమేళాకు తరలి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా హిందీ, ఇంగ్లీష్ తో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. మకర సంక్రాంతి నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. కుంభమేళ సమయంలో నదీ స్నానం చేస్తే మోక్షం కలుగుగుతుందనేది భక్తులు విశ్వాసం. గంగా, యమున, సరస్వతీ నదుల పవిత్ర సంగమంలో స్నానం ఆచరించేందుకు మొగ్గుచూపుతారు
కుంభమేళాలో ఎక్కడ స్టే చేయాలంటే?
మహా కుంభమేళాకు తరలి వచ్చే భక్తుల వసతికి సంబంధించి యూపీ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కుంభమేళా సమీపంలో యూపీ సర్కారు ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. మీ బడ్జెట్ కు తగినట్లుగా వసతిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
హోటళ్ళు: లగ్జరీ హోటళ్ళు, మిడ్ రేంజ్ హోటళ్ళు, బడ్జెట్ హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఉచిత వైఫై, 24/7 వాటర్, హౌస్ క్లీనింగ్, ఇన్ హౌస్ డైనింగ్‌ను అందిస్తాయి.
టెంట్ క్యాంపులు: లగ్జరీ టెంట్లు, బడ్జెట్ టెంట్లు, స్టాండర్డ్ టెంట్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన సౌకర్యాలు, కమ్యూనల్ బాత్రూమ్ లు అందుబాటులో ఉన్నాయి.
లగ్జరీ టెంట్లు: ఇవి కుంభమేళా సమీపంలోనే ఉన్నాయి. బెడ్స్, బాత్రూమ్‌లు, భోజన సదుపాయం అందుబాటులో ఉంటుంది.
స్టాండర్డ్ టెంట్లు: ఇవి ప్రయాగరాజ్ కుంభమేళాలోని కీలక ప్రదేశాలకు దగ్గరగా ఉన్నాయి. యాత్రికులకు సరసమైన ధరల్లో అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయి.
బడ్జెట్ టెంట్లు: భక్తులకు అతి తక్కువ ధరలో ఈ టెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రాథమిక అవసరాలు ఉంటాయి.
ధర్మసత్రాలు, ఆశ్రమాలు: కుంభమేళాలో పాల్గొనాలనుకునే వారు మంచి బసను పొందాలనుకునే వారికి ఆశ్రమాలు మంచి సెలెక్షన్. గీతా భవన్, పరమార్థ్ నికేతన్ ప్రయాగ రాజ్ లో ఉన్నాయి. ధర్మ సత్రాలు కూడా ఇక్కడ సరసమైన ధరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాగ రాజ్ లోని ఇస్కాన్, భారత్ సేవాశ్రమ సంఘం అద్భుతమైన ఎంపికలుగా చెప్పుకోవచ్చు.
హోమ్ స్టేలు, గెస్ట్ హౌస్ లు: మీరు ఇళ్లలో ఉండాలంటే పలు హోమ్ స్టేలు అందుబాటులో ఉంటాయి. హోమ్ స్టే, ప్రయాగ్ కుంభ్ కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.
ఉత్తరాది స్పెషల్ వంటకాలు
ఇక మహా కుంభమేళాలో ఉత్తరాది వంటకాలను ఆశ్వాదించే అవకాశం ఉంటుంది. ప్రయాగరాజ్ స్థానిక వంటకాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్, కేఫ్‌లు, స్వీట్ షాపులలో ఈ ఫుడ్స్ లభిస్తాయి. ప్రయాగ్ రాజ్ లో లభించే ప్రత్యేక ఫుడ్స్.. కచోరి సబ్జీ, ఆలూ పూరి, చోలే భాతురే, చాట్, సమోసాస్, గోల్ గప్పా, గులాబ్ జామ్, రబ్ది, మాల్పువా, జలేబీ, రసగుల్లా, మసాలా చాయ్, లస్సీ, నింబు పానీ, లంగర్ ఫుడ్ రుచి చూడవచ్చు.
కుంభమేళాను ఎలా చూడాలి?
మీరు ప్రయాగరాజ్ కు వెళ్లాలనుకుంటే.. ఇబ్బంది లేకుండా ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కుంభమేళాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు కాస్త సమయం కేటాయించాలి. స్నాన ఘాట్లు, అత్యవసర సేవలు, పర్యాటక ప్రదేశాల వివరాలను తెలుసుకోవాలి. ప్రయాగ రాజ్ లోని సమాచార కేంద్రాలలో మ్యాప్ లతో సహా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రయాగ్ రాజ్ కు ఎలా చేరుకోవాలి?
విమానాలు: బమ్రౌలి విమానాశ్రయం ప్రయాగ్‌రాజ్‌కు సమీపంలోనే ఉంటుంది. వారణాసి విమానాశ్రయం, లక్నో విమానాశ్రయం నుంచి కూడా ప్రయాగరాజ్ కు చేరుకోవచ్చు.
రైళ్లు: దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్ రాజ్ జంక్షన్ చేరుకునే అవకాశం ఉంది. మహా కుంభమేళాకు కోసం భారతీయ రైల్వే సంస్థ పలు ప్రాంతాల నుంచి 13 వేల రైళ్లను షెడ్యూల్ చేసింది.
రోడ్డు మార్గాలు: ప్రయాగ రాజ్ చేరుకోవడానికి యూపీ, మధ్యప్రదేశ్ సహా నార్త్ ఇండియాలోని చాలా నగరాలతో రోడ్డు మార్గాలు అనుసంధానించబడి ఉన్నాయి. NH-2, NH-19 అనేవి ప్రయాగ రాజ్ కు నేరుగా చేరుకునే జాతీయ రహదారులు.
తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లేవారి కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి.
Read Also: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లు ఇవే, రోజూ ఎన్ని లక్షల మంది ప్రయాణిస్తారో తెలుసా?