Good News for Women Above 60: ప్రభుత్వం వృద్ధ మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన మహిళలు ఇకపై ప్రభుత్వ రోడ్ వేస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వృద్ధ మహిళలకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గనుంది. అయితే, ఈ పథకం మన దగ్గర కాదు.. ఉత్తరప్రదేశ్ లో. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి అనుబంధ బడ్జెట్‌లో ఈ పథకానికి అవసరమైన నిధులను యోగీ ప్రభుత్వం కేటాయించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థకు ఉచిత ప్రయాణం వల్ల కలిగే ఖర్చును తిరిగి చెల్లించేందుకు రూ.100 కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు పైబడిన మహిళలు రాష్ట్ర రోడ్‌వేస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, ఈ ఉచిత ప్రయాణం ఏ తేదీ నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుంది, ప్రయాణానికి సంబంధించిన నియమాలు ఏంటి? అనే వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంది.
భారతీయ జనతా పార్టీ తన లోక్ కళ్యాణ్ సంకల్ప పత్రంలో వృద్ధ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ద్వారా ఆ హామీని అమలు చేసే దిశగా అడుగు వేసింది. వృద్ధ మహిళలకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే వారు వివిధ అవసరాల కోసం ఎలాంటి అదనపు ప్రయాణ ఖర్చు లేకుండా బస్సుల్లో వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. చాలామంది వృద్ధ మహిళలు కుటుంబ సభ్యులను కలవడానికి, ఆసుపత్రులకు వెళ్లడానికి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి, అలాగే మతపరమైన కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాల సందర్శనలకు బస్సులను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి ప్రయాణాల్లో రవాణా ఖర్చు తగ్గడం వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించనుంది.
వృద్ధ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు మహిళా సంక్షేమానికి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. మహిళా సంక్షేమ శాఖకు రూ.1,094.40 కోట్ల అదనపు కేటాయింపు చేసినట్లు వెల్లడించింది. ఈ నిధులను పలు సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగించనున్నారు. ముఖ్యంగా నిరుపేద మహిళలకు అందించే పింఛను పథకానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. అలాగే ముఖ్యమంత్రి బాల సేవా యోజనతో పాటు మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మహిళల భద్రత, గౌరవం, సామాజిక భద్రతతో పాటు ఆర్థిక సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఈ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి.
Read Also: 8 దశాబ్దాలకు ఊళ్లోకి అడుగు పెట్టిన బస్సు.. డప్పు దరువులతో స్వాగతం పలికి గ్రామస్తులు!