BIG TV LIVE Originals: భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చి వేసిన వందేభారత్ రైలు, విద్యుత్ తో నడుస్తుంది. పొల్యూషన్ లేకుండా అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. అయితే, ఈ రైలు ప్రయాణానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది? సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నడిస్తే ఎన్ని యూనిట్ల విద్యుత్ తీసుకుంటుంది? అనేది చాలా మందికి తెలియదు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 680 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గమ్యస్థానానికి చేరుకునేందుకు సుమారు 8 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వందేభారత్ రైలు ఎంత పవర్ తీసుకుంటుంది?
వందేభారత్ రైలు ఒక రైలు 1 కిలో మీటర్ ప్రయాణించడానికి దాదాపు 20 యూనిట్ల విద్యుత్తును ఉపయోగిస్తుంది. ఒక యూనిట్ ను కిలోవాట్ అవర్ గా పిలుస్తారు. 680 కిలోమీటర్లకు 13,600 యూనిట్లు ఖర్చు అవుతుంది. దేశంలో రైల్వే ప్రతి యూనిట్ విద్యుత్తుకు దాదాపు రూ. 6.50 చెల్లిస్తుంది. ఇక 13,600 యూనిట్లకు రూ.88,400 అవుతుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వందేభారత్ రైలు నడిచేందుకు సుమారు రూ. 88,400 ఖర్చ చేయాల్సి ఉంటుంది.
డీజిల్ కంటే ఎలక్ట్రిక్ ఖర్చు తక్కువేనా?
ఇక సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నడిచే డీజిల్ రైలు 3,060 నుంచి 4,080 లీటర్ల డీజిల్‌ను ఉపయోగిస్తుంది. డీజిల్ ధర లీటర్ కు రూ. 90. అంటే రూ.2,75,400 నుంచి రూ. 3,67,200 వరకు ఖర్చు అవుతుంది. సో, డీజిల్ తో పోల్చితే విద్యుత్ ఖర్చు 3 నుంచి 4 రెట్లు తక్కువగా ఉంటుంది.
ఏ రైలుకు ఎంత విద్యుత్ అవసరం అంటే?
ఎక్కువ కోచ్‌లు ఉన్న రైలు ఎక్కువ విద్యుత్తును ఉపయోగిస్తుంది. ఎక్కువ స్టాఫ్ లు ఉండే రైళ్లకు కూడా ఎక్కువ శక్తి అవసరం అందుకే, ఎక్కువ విద్యుత్తును తీసుకుంటుంది. వందే భారత్ లాంటి వేగవంతమైన రైళ్లు పవర్ ను ఆదా చేయడానికి స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. కొన్ని రైళ్లలో రీజెనరేటివ్ బ్రేకింగ్ అనే ఫీచర్ ఉంది. ఇది రైలు వేగాన్ని తగ్గించినప్పుడు పవర్ ను తిరిగి ఉపయోగించడం ద్వారా విద్యుత్తును ఆదా చేస్తుంది. బ్రేకింగ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.
ఎలక్ట్రిక్ రైళ్లు ఎందుకు బెస్ట్?
డీజిల్ వెర్షన్ రైళ్లతో పోల్చితే ఎలక్ట్రిక్ రైళ్లు పొగను విడుదల చేయవు. గాలి కాలుష్యం అనేది ఉండదు. ఎలక్ట్రిక్ రైళ్లు శుభ్రంగా ఉంటాయి. ఎలక్ట్రిక్ రైళ్లు వేగంగా, శుభ్రంగా ఉండటంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. డబ్బును ఎక్కువగా ఆదా చేస్తాయి. 2030 నాటికి అన్ని రైళ్లు విద్యుత్తుతో నడిచేలా కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. ఇవి దేశ రైల్వేకు మరింత అనుకూలంగా మారబోతున్నాయి. కాలుష్య రహిత రైల్వేగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: సికింద్రాబాద్ to ఢిల్లీ.. తెలంగాణ ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్ లో ఏది బెస్ట్? ఏది ఫాస్ట్?