Vande Bharat Ticket Cancellation: భారతీయ రైల్వే వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చిన రైళ్లు వందే భారత్ రైళ్లు. అత్యాధునిక టెక్నాలజీ, అత్యంత వేగం, మెరుగైన వసతులతో అందుబాటులోకి వచ్చాయి. భారతీయ రైల్వే వ్యవస్థలోకి అడుగు పెట్టిన ఈ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 54 వేర్వేరు మార్గాల్లో మొత్తం 108 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అన్ని రూట్లలో మంచి ఆక్యుపెన్సీని పొందుతున్నాయి. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే నమో భారత్ (వందే భారత్ మెట్రో) రైళ్లతో పాటు వందే భారతో స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మరోవైపు రద్దీ రూట్లలో కోచ్ ల సంఖ్య పెంచాలని రైల్వే సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణీకులు రెండు క్లాసులలో వెళ్తున్నారు. వాటిలో ఒకటి AC చైర్ కార్ కాగా మరొరకటి ఎగ్జిక్యూటివ్ క్లాస్.
వందే భారత్ రైలు టికెట్ క్యాన్సిల్ చేయాలంటే?
అనుకోని కారణాలతో వందే భారత్ రైలు టికెట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తే, అమౌంట్ పూర్తి మొత్తంలో రీఫండ్ లభించదు. రైల్వే సంస్థ టికెట్ క్యాన్సిల్ మీద ఛార్జీలను వసూలు చేస్తున్నది. ఈ ఛార్జీలు రైలు తరగతి, టిక్కెట్ రద్దు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇంతకీ వందే భారత్ రైలు టికెట్ క్యాన్సిల్ చేయడం వల్ల ఎంత ఛార్జీ వసూళు చేస్తారు? ఎంత మొత్తంలో రీఫండ్ అవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు టికెట్ క్యాన్సిల్ ఛార్జీలు
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు టికెట్ క్యాన్సిల్ పై ఛార్జీ అనేది రైలు ప్రయాణ సమయాన్ని బట్టి ఉంటుంది. రైలు ప్రయాణ ప్రారంభానికి 48 గంటల ముందు మీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు టిక్కెట్‌ను రద్దు చేస్తే, మీరు రూ. 240 ఛార్జీని చెల్లించాలి. ఈ ఛార్జీ AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కి సమానంగా ఉంటుంది. మీ ప్రయాణ సమయానికి 48 నుండి 12 గంటల ముందు టిక్కెట్‌ను రద్దు చేస్తే, మీరు మొత్తం ఛార్జీలో 25 శాతం, కనీస ఫ్లాట్ రద్దు ఛార్జీని చెల్లించాలి. ఇది కాకుండా, మీరు ప్రయాణ సమయానికి 12 నుండి 4 గంటల ముందు టిక్కెట్‌ను రద్దు చేస్తే, మీరు మొత్తం ఛార్జీలో 50 శాతం, కనీస ఫ్లాట్ రద్దు ఛార్జీని చెల్లించాలి. మొత్తంగా ఏ కారణం చేతనైనా వందే భారత్ రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ అయ్యే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే, టికెట్ బుక్ చేసే సమయంలోనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కచ్చితంగా ప్రయాణిస్తామనుకుంటేనే వందే భారత్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఉత్తమం.
Read Also: లాస్ట్ మినిట్ లో జర్నీ క్యాన్సిల్? మీ ట్రైన్ టికెట్ ను వేరే వాళ్లకు ఇలా ట్రాన్సఫర్ చేయొచ్చని తెలుసా?