Vande Bharat Sleeper: భారతీయ రైల్వేలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వందేభారత్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నది. 8 కోచ్ లతో ప్రారంభమైన వందేభారత్ ట్రైన్ ఇప్పుడు 20 కోచ్ లకు చేరుకుంది. త్వరలోనే 24 కోచ్ లకు పెరగనుంది. అటు సుదీర్ఘ రాత్రి ప్రయాణాల కోసం రూపొందిస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కబోతున్నది. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాన్ని వెల్లడించారు. లోడెడ్ సిమ్యులేషన్ ట్రయల్స్ కోసం కోచ్‌లను ఐసీఎఫ్ చెన్నై డిస్ ప్యాచ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తొలి వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
రెడీ అవుతున్న 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు
ప్రస్తుతం 10 వందేభారత్ స్లీపర్ రైళ్లను రెడీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఫస్ట్ మోడల్ రైలు రెడీ అయ్యింది. త్వరలో ట్రయల్ రన్ కు సిద్ధం అయ్యింది. జనవరి 26న తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకే రోజున ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్(USBRL)తో పాటు వందే భారత్ స్లీపర్ రైలును లాంచ్ చేయనున్నట్లు సమాచారం. తొలి వందేభారత్ రైలును న్యూఢిల్లీ-శ్రీనగర్ నడుమ నడపాలని ఇప్పటికే రైల్వే అధికారులు నిర్ణయించారు.
స్లీపర్ రైలులో విమానం తరహా సౌకర్యాలు
వందేభారత్ స్లీపర్ రైలుకు బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. విమానం మాదిరిగానే ఇందులో సౌకర్యాలు ఉంటాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. వందే భారత్ స్లీపర్ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణీకులు వెళ్లే అవకాశం ఉంది. ఇందులో 1 ఫస్ట్ ఏసీ కోచ్, 4 సెకండ్ ఏసీ కోచ్ లు, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఇక ఈ రైల్లో ప్రత్యేకమైన ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఉన్నది. ప్రతి బెర్త్ దగ్గర అత్యవసర స్టాప్ బటన్స్ ఉంటాయి. ప్రయాణీకులు అత్యంత విలాసవంతంగా ప్రయాణించేలా బెర్తులను మెరుగైన కుషన్ తో రూపొందించారు. అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. ఇక ఈ రైళ్లలో బయో వాక్యూమ్ టాయిలెట్లు ఉంటాయి. బటన్ నొక్కకుండానే నీళ్లు వచ్చేస్తాయి. టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, హాట్ వాటర్ షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఒక కోచ్ లో నుంచి మరో కోచ్ లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్ డోర్లు ఉపయోగపడుతాయి. ఛార్జింగ్ సాకెట్లతో పాటు ప్రయాణీకులకు వెచ్చదనాన్ని ఇచ్చేలా కోచ్ హీటర్లు ఉంటాయి. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ఉంటుంది.
Vande Bharat (Sleeper) Train dispatched from ICF Chennai for loaded simulation trial. pic.twitter.com/nyLLhzoLMP
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 18, 2024
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
ఇక ఈ రైలు భద్రత విషయంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రతి కోచ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైలు ప్రమాదానికి గురి కాకుండా ‘కవచ్’ సిస్టమ్ ను అమర్చారు. బ్లాట్ ప్రూఫ్ బ్యాటరీ, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ఉంటుంది. ఈ రైలు 800 నుంచి 1200 కిలో మీటర్ల దూరం ఏక బిగిన వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఖజురహోలో స్లీపర్ ట్రైన్ ఫీల్డ్ ట్రయల్స్
వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జరుగనున్నది. రైల్వే డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) పర్యవేక్షణలో ఈ ట్రయల్స్ కొనసాగుతాయి. రైలు స్థిరత్వం, వైబ్రేషన్, డైనమిక్ పనితీరును ఈ ట్రయల్ రన్ లో పరిశీలించనున్నారు.
Read Also: కుర్రాళ్లకు క్రేజీ న్యూస్.. హైదరాబాద్ నుంచి గోవాకు వందే భారత్?