New Delhi to Secunderabad Vande Bharat Sleeper Train: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఒకేసారి దేశ వ్యాప్తంగా సుమారు 10 రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో తెలుగు రాష్ట్రాలకు 2 నుంచి 3 రైళ్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూట్లు కూడా దాదాపు ఖరారు అయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానికి హైదరాబాద్ కు ఓ వందేభారత్ స్లీపర్ రైలును నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. న్యూఢిల్లీ-సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య ఈ కొత్త రైలును ప్రారంభించబోతోంది. ఇప్పటికే, ఈ మార్గంలో రాజధాని ఎక్స్ ప్రెస్, దురంతో ఎక్స్ ప్రెస్ నడుస్తుండగా, ఇప్పుడు మూడో ప్రీమియం రైలుగా వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతోంది.
న్యూఢిల్లీ- సికింద్రాబాద్ స్లీపర్ రైలు వేగం, ప్రయాణ సమయం
న్యూఢిల్లీ- సికింద్రాబాద్ మధ్య 1,667 కి. మీ దూరం ఉంటుంది. సుమారు 20 గంటల్లో ఈ వందేభారత్ తన ప్రయాణాన్ని పూర్తి చేయనుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 160 కి.మీ. వేగంతో నడిచేలా రూపొందించారు. ఈ రైలు ప్రారంభం అయితే, ఈ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదే అవుతుంది. ఆ తర్వాత ప్లేస్ లో రాజధాని ఎక్స్ ప్రెస్, దురంతో ఎక్స్ ప్రెస్ ఉంటాయి.
ఎన్ని స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటుందంటే?
న్యూఢిల్లీ నుంచి బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్ వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ రైలు ఆగ్రా కాంట్, గ్వాలియర్, వి లక్ష్మీబాయి జెహెచ్ఎస్, భోపాల్, ఇటార్సి, నాగ్ పూర్, బల్హర్షా, కాజీపేట్ జంక్షన్‌తో సహా ఈ మార్గంలోని ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. రెండు వైపులా ఈ స్టాఫ్ లు ఉంటాయి.
కోచ్ కంపోజిషన్, టికెట్ ధర గురించి..
న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. వాటిలో 11 AC 3 టైర్ కోచ్‌లు, 4 AC 2 టైర్ కోచ్‌లతో పాటు ఒక ఫస్ట్ క్లాస్ AC కోచ్ ఉంటుంది. AC 3-టైర్ కోచ్‌లో ప్రయాణించడానికి ఛార్జీ దాదాపు రూ. 3600, AC 2-టైర్ కోచ్ దాదాపు రూ. 4800, AC ఫస్ట్ క్లాస్ దాదాపు రూ. 6000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే అసలు రేట్ల వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ- సికింద్రాబాద్ వందే భారత్ స్లీపర్ రైలు టైమ్ టేబుల్
న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుంచి రాత్రి 8.50 నిమిషాలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్ కు చేరుకునే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ ను రైల్వేశాఖ విడుదల చేయనుంది. ఎన్ని స్టాఫ్ లు, ఎంత సేపు ఆగుతుంది? అనే పూర్తి వివరాలు వెల్లడించనుంది. ఈ స్లీపర్ రైలు దేశ, రాష్ట్ర రాజధానుల మధ్య కనెక్టివిటీని పెంచనుంది.
Read Also: రైలు టికెట్స్ త్వరగా బుక్ చేసుకోవాలా? IRCTC eWalletను ఇలా వాడేయండి!