Rajdhani vs Vande Bharat Sleeper Food: ప్రీమియం రైళ్లలో ప్రయాణించేటప్పుడు వేగం, సౌకర్యం మాత్రమే కాదు.. రైలులో అందించే ఆహారం కూడా ప్రయాణికులకు ముఖ్యమే. ముఖ్యంగా రాత్రంతా ప్రయాణించే రైళ్లలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్స్, డిన్నర్ లాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ విషయంలో వందే భారత్ స్లీపర్, రాజధాని ఎక్స్‌ప్రెస్ రెండింటికీ ప్రత్యేక క్యాటరింగ్ వ్యవస్థ ఉంది. అయితే, ఈ రెండు రైళ్లలో ఒకే రకమైన మెనూ ఉండదు. రైలు మార్గం, ప్రాంతం, ప్రయాణికుల క్లాస్, సర్వీస్ ఆధారంగా ఫుడ్ వెరైటీలు మారుతుంటాయి.
వందే భారత్ స్లీపర్‌లో ప్రతి రైలుకు ఒకే మెనూ కాకుండా, సర్వీస్‌కు అనుగుణంగా ఆహారాన్ని అందించే విధానం ఉంది. హౌరా–కామాఖ్య మార్గంలో నడిచే వందే భారత్ స్లీపర్ మెనూలో బెంగాలీ, అస్సామీ వంటకాలు ఎక్కువగా కనిపిస్తాయి. భోజనంలో నెయ్యి అన్నం, పులావ్, పరోటా, పలు రకాల పప్పులు, ఆలూ కూరలు, మటర్ పనీర్, చనార్ దాల్నా లాంటి వెజ్ వంటకాలు ఉంటాయి. నాన్ వెజ్ లో బెంగాలీ చికెన్ కర్రీ, చికెన్ మసాలా, అస్సామీ స్టైల్ చికెన్ కర్రీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. డెజర్ట్ గా సందేశ్, రసగుల్లా, ఖీర్ కదమ్, నారికల్ బర్ఫీ లాంటి స్వీట్లు ఉంటాయి.
రాజధాని ఎక్స్ ప్రెస్ లో క్యాటరింగ్ వ్యవస్థ చాలా కాలంగా కొనసాగుతోంది. ఇందులో ప్రాంతాన్ని బట్టి మెనూను మార్చే విధానం ఉంది. ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ మధ్య, దక్షిణ ప్రాంతాలుగా వంటకాలను విభజించారు. బ్రేక్ ఫాస్ట్ లో లూచీ–ఆలూ దమ్, పరాటా, పూరీ, చోలే భటూరా, పోహా, ఉప్మా, ఇడ్లీ, వడ, దోస, పొంగల్ లాంటి వంటకాలు ఉంటాయి. గుడ్డుతో ఆమ్లెట్, ఉడికించిన గుడ్లు, స్క్రాంబుల్డ్ ఎగ్ లాంటి ఆప్షన్లు కూడా ఉంటాయి.
రాజధాని రైళ్లలో ప్రాంతీయ వంటకాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. తూర్పు ప్రాంతంలో చేపల కూరలు, మచ్చర్ జోల్ వంటి వంటకాలు కనిపిస్తే, ఉత్తర ప్రాంతంలో కధీ పనీర్, మటర్ పనీర్, పనీర్ కోఫ్తా లాంటి వంటకాలు ఉంటాయి. పశ్చిమ ప్రాంతంలో గుజరాతీ కధి, గుజరాతీ దాల్, చికెన్ కొల్హాపురి లాంటి వంటకాలు, దక్షిణ ప్రాంతంలో బిసిబెలె భాత్, చికెన్ చెట్టినాడ్, మలబార్ చికెన్ కర్రీ, ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ లాంటి వంటకాలు అందుబాటులో ఉంటాయి.
IRCTC మెనూ ప్రకారం రాజధాని సర్వీసుల్లో పన్నులతో కలిపి మార్నింగ్ టీ ధర సుమారు రూ.35గా ఉంది. అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఒక్కొక్కటి రూ.140 కాగా, మధ్యాహ్నం, రాత్రి భోజనం రూ.245గా ఉంది. భోజనంలో ప్రధాన వంటకంతో పాటు సూప్, బ్రెడ్, క్రోసెంట్, వెన్న, డెజర్ట్ లాంటి వాటిని కూడా అందిస్తారు. వందే భారత్ స్లీపర్ మెనూ ఆయా రైలు, మార్గానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించే విధానం కనిపిస్తుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ మాత్రం దేశంలోని వివిధ ప్రాంతాల ఆహార రుచులను కలిపి మరింత విస్తృతమైన మెనూను అందిస్తుంది.
Read Also: వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!