Vande Bharat Express News: ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ (20708/20707) రైలుకు ఏలూరు స్టేషన్ (Eluru Railway Station) లో ఒక నిమిషం పాటు ఆపనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 25 నుంచి 6 నెలల పాటు ఈ రైలుకు ఏలూరు స్టేషన్ లో హాల్టింగ్ తీసుకుంటుందని తెలిపింది. వందే భారత్ రైలును ఏలూరులో ఆపేలా నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హాల్టింగ్ లేకపోవడం ప్రయాణీకుల ఇబ్బందులు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడిచే వందే భారత్(Vande Bharat) రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి డిమాండ్ ఉంది. సికింద్రాబాద్- విశాఖపట్నం, కాచిగూడ- బెంగళూరు, సికింద్రాబాద్- తిరుపతి మార్గాల్లో నడిచే ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. అయితే, సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్యన నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు విజయవాడ- రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేదు. ఈ ప్రాంత వాసులు ఇబ్బందులు పడేవారు. త్వరగా వెళ్లాలని వందేభారత్ రైలు ఎక్కినప్పటికీ ఇతర స్టేషన్లలో దిగాల్సి వచ్చేది. ప్రయాణీకుల ఇబ్బందులను గమనించిన సౌత్ సెంట్రల రైల్వే.. ఏలూరులో రైలును ఆపాలని నిర్ణయం తీసుకుంది.
ఏలూరులో ఒక్క నిమిషం పాటు ఆగనున్న వందేభారత్
వందేభారత్ ఎక్స్ ప్రెస్ గురువారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు సికింద్రాబాద్- విశాఖ మధ్య రాకపోకలు కొనసాగిస్తున్నది. ఉదయం 5 గంటలకు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 1. 50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యలో ఈ రైలు ఆరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇంతకు ముందు ఐదు స్టేషన్లు ఉండగా.. ఇప్పుడు ఏలూరు వచ్చి చేరడంతో ఆ సంఖ్య పెరిగింది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ వందేభారత్ ఉదయం 9.49 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని ఒక్క నిమిషం పాటు ఆగుతుంది. 9.50 గంటలకు బయలుదేరుతుంది. ఇక విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. సాయంత్రం 5.54 గంటలకు ఏలూరు స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ ఒక్క నిషం పాటు ఆగుతుంది. 5.55 గంటలకు ఏలూరు నుంచి బయల్దేరనున్నట్లు రైల్వేశాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
Read Also: గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాలకూ ఓ వందేభారత్ స్లీపర్.. ఏ రూట్‌లో నడుస్తుందంటే?
ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు
ఏలూరు స్టేషన్ లో వందేభారత్ రైలు ఆగడం పట్ల ఏలూరుతో పాటు చుట్టు పక్కల ఉన్న భీమవరం, నర్సాపురం, పాలకొల్లు సహా పలు ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు, విశాఖతో పాటు హైదరాబాద్ కు వెళ్లాలనుకునే ప్రయాణీకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
Read Also: ఈ రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే.. మీకో సూపర్ న్యూస్!
Read Also: ఒకేసారి పట్టాలెక్కనున్న 9 వందేభారత్ స్లీపర్ రైళ్లు, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!