Warangal Tour: వరంగల్ తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక , సాంస్కృతిక రాజధానిగా పిలువబడే నగరం. వరంగల్ గొప్ప కాకతీయ వారసత్వం, అద్భుతమైన స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూడటానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. నిత్యం వివిధ ప్రదేశాల నుండి ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారు. ముఖ్యంగా ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేయాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.. హైదరాబాద్ నుండి వరంగల్ దగ్గరగానే ఉండటంతో ఒక్క రోజులోనే ఇక్కడి పర్యాటక ప్రాంతాలను చూసి తిరిగి రావొచ్చు. మరి వరంగల్ లో తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రాంతాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేయి స్తంభాల ఆలయం:
హన్మకొండలోని వేయి స్తంభాల గుడి వరంగల్‌లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించిన ఈ ఆలయాన్ని శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలువబడుతుంది. ఈ ఆలయం శివుడు, విష్ణు, సూర్యుడు ముగ్గురు దేవుళ్ళకు అంకితం చేయబడింది. ఈ ఆలయం యొక్కనక్షత్రాకార ఆకృతి, సున్నితమైన శిల్పకళ కాకతీయ వాస్తుశిల్పం యొక్క గొప్పతనాన్నితెలియజేస్తుంది. ఈ ఆలయంలోని స్తంభాల సందర్శకులను ఆకర్షిస్తాయి. ఈ ఆలయం చారిత్రక , ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు.
భద్రాకాళి ఆలయం:
వరంగల్ , హన్మకొండ మధ్య ఉన్న భద్రాకాళి ఆలయం మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం భద్రాకాళి దేవికి అంకితం చేయబడింది. 1950లో శ్రీ గణపతి దేవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం 2.7 మీటర్ల ఎత్తులో ఎనిమిది చేతులతో, వివిధ ఆయుధాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయం సమీపంలోని భద్రాకాళి సరస్సు, సహజ నిర్మాణాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్రదేశం భక్తులతో పాటు పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది.
వరంగల్ కోట:
కాకతీయ రాజవంశం యొక్క గొప్పతనానికి చిహ్నంగా నిలిచే వరంగల్ కోట నగరంలోని మరో ముఖ్యమైన ఆకర్షణ. 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ కోటలో రాతి ద్వారాలు, సున్నితమైన శిల్పాలు కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కాకతీయ కళా తోరణం, ఈ కోటలోని ఒక భాగం. ఇది తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా గుర్తింపు పొందింది. కోట శిథిలమైనప్పటికీ.. దాని నిర్మాణం, చారిత్రక ప్రాముఖ్యత నేటికి సందర్శకులను ఆకర్షిస్తుంది.
ఖుష్ మహల్:
తుగ్లక్ పాలనలో 14వ శతాబ్దంలో నిర్మించబడిన ఖుష్ మహల్, వరంగల్ కోటకు సమీపంలో ఉంటుంది. దీని యొక్క నాలుగు వంపు తిరిగిన గోడలు, విశాలమైన గదులు చారిత్రక నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. ఈ స్థలం చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారికి తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.
Also Read: హైదరాబాద్ దగ్గర్లో హిల్ స్టేషన్.. ఒక్క రోజులో వెళ్లి రావొచ్చు !
పద్మాక్షి గుట్ట:
వరంగల్ జిల్లాలోని పద్మాక్షి గుట్ట ఒక పురాతన జైన దేవాలయానికి నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయంలో పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయంలో జైన తీర్థంకరులు ,ఇతర దేవతల శిల్పాలు ఉన్నాయి. ఈ గుట్ట చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు సహజ సౌందర్యాన్ని కూడా కలిగి ఉంటుంది.