Air India Boeing 747 Flight Wing Wave Video: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు బోయింగ్ 747 విమానాలకు దశాబ్దాల అనుబంధం ఉంది. సుమారు అర్థ శతాబ్దం పాటు ఈ సంస్థలో సేవలు అందించాయి. తాజాగా ఎయిర్ ఇండియాలోని నాలుగు బోయింగ్ 747 విమానాలు తమ విధుల నుంచి తప్పుకున్నాయి. చివరి సారిగా ముంబై ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం వింగ్ వేవ్ విన్యాసం చేసి చూపరులను ఆకట్టుకుంది.
భయపడ్డ ముంబై వాసులు..
తాజాగా ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా జంబో జెట్ మెజిస్టిక్-747 బోయింగ్ విమానం చివరి సారిగా టేకాఫ్ అయ్యింది. రెండు నిమిషాలకు మొదట ఎడమవైపు కాస్త ఒరిగింది. అదే సమయంలో విమానం ఇంజిన్ లో నుంచి పెద్ద మొత్తంలో పొగ వచ్చింది. కాసేపటి తర్వాత కుడి వైపుకు ఒరిగింది. అప్పుడు మరో ఇంజిన్ నుంచి పొగ బయటకు వచ్చింది. కింది నుంచి చూస్తున్న వాళ్లు భయంతో వణికిపోయారు. విమానంలో ఏదో టెక్నికల్ సమస్య వచ్చిందని భయపడ్డారు. కానీ, అంది వాస్తవం కాదని తెలిసి రిలాక్స్ అయ్యారు.
ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో నివసిస్తున్న ముంబై వాసులు ఈ సంవత్సరం చాలా అరుదైన దృశ్యం ఒకటి చూశారు, కాస్త భయపడ్డారు కూడా. ఎయిరిండియా రంగులతో కూడిన భారీ బోయింగ్ 747 టేకాఫ్ అయింది, అయ్యాక దాని ఎడమవైపుకు ఆపై కుడివైపుకి వంగి, ఆకాశంలోకి ఎగిరే ముందు జంబో జెట్ వింగ్ వేవ్ చేసింది.
పైలట్… pic.twitter.com/GczzotAn58
— Journey with Jogu (@JogulambaV) December 18, 2024
వింగ్ వేవ్ విన్యాసంతో గుడ్ బై చెప్పిన బోయింగ్ 747
ఒక పైలట్ పదవీ విరమణ చేయడానికి ముందు.. చివరిసారిగా విమానం నడిపే సమయంలో, లేదంటే.. ఒక విమానాన్ని సర్వీసులో నుంచి తొలగించే ముందు చివరి ప్రయాణం చేస్తున్నప్పుడు విమానాన్ని ఎడమవైపు, కుడివైపు వంచుతారు. ఇలా చేయడాన్ని ఏవియేషన్ పరిభాషలో ‘వింగ్ వేవ్’ అంటారు. విమానాన్ని నడపడంలో అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగి పైలెట్లు మాత్రమే ‘వింగ్ వేవ్’ను నిర్వహిస్తారు. ఏవియేషన్ అధికారులు కొద్ది మంది పైలెట్లకు మాత్రమే ‘వింగ్ వేవ్’కు అవకాశం కల్పిస్తారు.
4 బోయింగ్ 747 విమానాలకు వీడ్కోలు
ముంబై నుంచి టేకాఫ్ అయిన బోయింగ్ జెట్ 747 విమానాన్ని ఎయిర్ ఇండియా సంస్థ సర్వీసు నుంచి తొలగించింది. దీనితో పాటు మరో మూడు బోయింగ్ కూడా సర్వీసుల నుంచి తప్పించింది. మొత్తం నాలుగు బోయింగ్ విమానాలను అమెరికాకు చెందిన ఎయిర్ సేల్ సంస్థకు విక్రయించింది. ఈ విమానాల్లో ఒకదానిని ముంబై విమానాశ్రయం నుంచి అమెరికాకు తీసుకు వెళుతున్నప్పుడే బోయింగ్ 747 విమానం పైలెట్ ‘వింగ్ వేవ్’ విన్యాసం చేసి ఆకట్టుకున్నారు.
1971 మార్చి 22 నుంచి ఎయిర్ ఇండియాలో సేవలు
బోయింగ్ 747 విమానం మార్చి 22, 1971లో తొలిసారి ఎయిర్ ఇండియా సంస్థలోకి అడుగు పెట్టింది. ఈ జంబో జెట్ విమానం 50 ఏళ్లకు పైగా ఎయిర్ ఇండియాలో సేవలు అందించింది. ఎంతో మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది. ఇక ఈ సంస్థకు చెందిన విమానం చివరిసారిగా మార్చి 2021లో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) 2022లో ఎయిర్ ఇండియా దగ్గర ఉన్న మొత్తం నాలుగు బోయింగ్ 747 విమానాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది. బోయింగ్ 747 విమానానికి నాలుగు ఇంజన్లు ఉంటాయి. రెండు అంతస్తులుగా ఉంటుంది. ఈ విమానం ప్రయాణీకుల వెర్షన్ తో పాటు కార్గో వెర్షన్ లో రూపొందించారు. ఈ విమానం గంటకు 913 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంతేకాదు, ఏకబిగిన 13,450 కిలో మీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. బోయింగ్ 747 విమానంలో 416 నుంచి 524 మంది ప్రయాణీకులు వెళ్లే అవకాశం ఉంటుంది.
Read Also: సముద్రం మధ్యలో విమానాశ్రయం, అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్న డ్రాగన్ కంట్రీ!