Indian Railway: రైల్వే సంస్థలో మహిళా సిబ్బంది పాత్ర మరువలేనిదని నిరూపించింది భారతీయ రైల్వే సంస్థ. ఉమెన్స్ డే సందర్భంగా పూర్తి మహిళా సిబ్బందితో వందేభారత్ రైలును నడిపించింది. ముంబైలోని సీఎస్ఎంటీ(ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) రైల్వే స్టేషన్ నుంచి షిరిడీ వరకు ఆ రైలు ప్రయాణం కొనసాగించింది. ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలెట్ అయిన సురేఖా యాదవ్, అసిస్టెంట్ లోకో పైలెట్ సంగీత కుమారి ఈ రైలును నడిపించారు. ఇవాళ(మార్చి 8న) ఉదయం 6.20 నిమిషాలకు ముంబై నుంచి ఆ రైలు బయల్దేరి నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరుకుంది.
పూర్తి మహిళా సిబ్బందితో..
రైల్వేలో మహిళ పాత్ర పెరుగుతుందని నిరూపించేందుకు భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ వందేభారత్ రైల్లో లోకో పైలెట్ల నుంచి మొదలు కొని టీటీఈల వరకు అందరూ మహిళలే ఉన్నారు. హెడ్ టికెట్ ఎగ్జామినర్ అనుష్క కేపీ, ఎంజే రాజ్‌పుత్, సీనియర్ టికెట్ ఎగ్జామినర్ సారికా ఓజా, సువర్ణా పాస్తే, కవితా మారల్, మనిషా రామ్ ఈ రైలులో విధులు నిర్వహించారు. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు పూర్తి మహిళా సిబ్బందితో వందేభారత్ రైలు సీఎస్ఎంటీ నుంచి షిర్డీ వరకు ప్రయాణించింది” అని రాసుకొచ్చింది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, రైలు మేనేజర్, టీసీలు, రైలు హోస్టెస్‌లు ఉన్న ఫోటోను షేర్ చేసింది.
మహిళా సాధికారతకు పెద్దపీట
“భారత రైల్వే మహిళా సాధికారతకు ఎప్పుడూ పెద్దపీట వేస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సెంట్రల్ రైల్వే పూర్తిగా మహిళా సిబ్బందితో CSMT-షిర్డీ వందే భారత్‌ను నడుపుతోంది. సెంట్రల్ రైల్వే ఇతర వందే భారత్ రైళ్లలో కూడా ఇలాంటి చొరవ తీసుకుని పూర్తిగా మహిళా సిబ్బందితో నడిపించేందుకు ప్రయత్నిస్తోంది” అని సెంట్రల్ రైల్వే CPRO డాక్టర్ స్వప్నిల్ నీలా వెల్లడించారు. పూర్తి మహిళా సిబ్బందితో నడిచే రైల్లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని సెంట్రల్ రైల్వే ముంబైకి చెందిన లోకో పైలట్ సురేఖా శంకర్ యాదవ్ వెల్లడించారు.
Read Also: మహిళలూ.. సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్లేసెస్ ఇవే!
🚆✨ A PIONEERING MOMENT FOR WOMEN IN RAILWAYS! ✨🚆
On this #InternationalWomensDay, history was made as the Vande Bharat Express, Train No. 22223, departed from CSMT with an all-women crew at the helm!
This trailblazing team includes:
👩✈️ Loco Pilot & Assistant Loco Pilot
👩💼… pic.twitter.com/dQuaRjqFxp— Central Railway (@Central_Railway) March 8, 2025
సంతోషం వ్యక్తం చేసిన క్రూ సభ్యులు
“ఉమెన్స్ డే రోజు మహిళా సిబ్బందితో వందేభారత్ రైలు నడపడం మాకెంతో గర్వంగా ఉంది. మహిళలు అన్నిరంగాల్లో సమస్థవంతంగా రాణిస్తున్నారు అని చెప్పేందుకు ఇదో ఉదాహారణ. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది” అని సెంట్రల్ రైల్వే ప్యాసింజర్ రైలు మేనేజర్ శ్వేతా ఘోన్ వెల్లడించారు. “ప్రతి స్త్రీ స్వావలంబన, స్వతంత్రంగా ఉండాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఈ అరుదైన అవకాశం లభించడం సంతోషంగా ఉంది” అని CSMT-షిర్డీ రైలు హోస్టెస్ రుబీనా బేగం చెప్పుకొచ్చారు. అటు ప్రధాని మోడీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నారి శక్తి’ అభినందనలు చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించడం సంతోషంగా ఉందన్నారు. వారి విజయాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
Read Also: దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయంటే?