ప్రపంచమంతా చుట్టేసి కొత్త ప్రాంతాలు, సంస్కృతులు, చారిత్రక కట్టడాలను చూడాలని చాలామంది కలలు కంటారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది విదేశీ పర్యాటకులు వివిధ దేశాలను సందర్శిస్తారు. అయితే వారిలో ఎక్కువ మంది వెళ్లే దేశం ఫ్రాన్స్. తాజా అంతర్జాతీయ పర్యాటక గణాంకాల ప్రకారం 2024లో ఫ్రాన్స్‌కు 10.2 కోట్లకు పైగా విదేశీ పర్యాటకులు వచ్చారు. దీంతో ప్రపంచంలో అత్యధిక మంది టూరిస్ట్‌లు వెళ్లే దేశంగా ఫ్రాన్స్ మరోసారి నిలిచింది.
కొత్త ప్రదేశానికి వెళ్లాలని ఆలోచించే సమయంలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతలు ఉంటాయి. ఫ్రాన్స్‌లో మాత్రం అన్ని రకాల టూరిస్ట్‌లు ప్రత్యేక అనుభవం లభిస్తుంది. చరిత్ర, కళలు, ఫ్యాషన్, ప్రకృతి అందాలు, రుచికరమైన వంటకాలు అన్నీ ఒకే దేశంలో లభిస్తాయి. అంతేకాకుండా అక్కడి రవాణా సౌకర్యాలు కూడా ప్రపంచ స్థాయిలో ఉండటంతో పర్యాటకులు సులభంగా దేశమంతా తిరగగలుగుతారు. ఏ కాలంలో వెళ్లినా ఫ్రాన్స్‌లో చూసేందుకు ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. అందుకే ఏడాది పొడవునా అక్కడికి విదేశీ సందర్శకులు వస్తుంటారు.
ఫ్రాన్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే లూవ్రే మ్యూజియంలో విలువైన కళాఖండాలను చూడటానికి లక్షల మంది పర్యాటకులు వస్తారు. ఫ్రెంచ్ రివేరా ప్రాంతం అందమైన బీచ్‌లు, విలాసవంతమైన రిసార్టులకు ఫేమస్. మధ్య యుగం నాటి కోటలు, చిన్న గ్రామాలు, పచ్చని ద్రాక్షతోటలు, ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. అదనంగా ఫ్రాన్స్‌లోని బేకరీలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వంటకాలతో ప్రత్యేక గుర్తింపు పొందాయి.
ఫ్రాన్స్‌లో పురాతన చరిత్రతో పాటు ఆధునిక జీవనశైలి కనిపిస్తుంది. మ్యూజియంలు, థియేటర్లు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక ఉత్సవాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
ప్రతి ప్రాంతానికి ప్రత్యేక సంప్రదాయాలు, నిర్మాణ శైలి, స్థానిక సంస్కృతి ఉండటంతో టూరిస్ట్‌లు మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాలని కోరుకుంటారు.
2024లో స్పెయిన్ ప్రపంచంలో రెండో అత్యధిక పర్యాటకులను ఆకర్షించిన దేశంగా నిలిచింది. ఆ దేశానికి సుమారు 9.38 కోట్ల మంది విదేశీ సందర్శకులు వెళ్లారు. అందమైన బీచ్‌లు, రంగురంగుల పండుగలు, చారిత్రక నగరాలు, ఉత్సాహభరితమైన సంస్కృతి స్పెయిన్ ప్రత్యేకత. బార్సిలోనా, మాడ్రిడ్, సెవిల్లే, వాలెన్సియా వంటి నగరాలు పర్యాటకులకు ఎంతో ఇష్టమైనవి.
అమెరికా ప్రపంచంలో మూడో అత్యధిక పర్యాటకులను ఆకర్షించే దేశంగా ఉంది. ప్రతి సంవత్సరం అక్కడికి సుమారు 7.2 నుంచి 7.9 కోట్ల మంది విదేశీ పర్యాటకులు వెళ్తున్నారు.
న్యూయార్క్ నగరం, హాలీవుడ్, గ్రాండ్ కాన్యాన్, యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ వంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రకృతి అందాలు, వినోదం, సాంస్కృతిక వైవిధ్యం అమెరికాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఫ్రాన్స్‌లో చరిత్ర, కళలు, ప్రకృతి, ఫ్యాషన్, ఫుడ్ కల్చర్, అన్నీ కలిసి ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. కుటుంబాలు, జంటలు, ఒంటరిగా ప్రయాణించే వారు అందరూ తమ అభిరుచికి తగ్గ ప్రదేశాలను అక్కడ కనుగొనవచ్చు.
అద్భుతమైన రవాణా వ్యవస్థ కూడా పర్యాటకులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ కారణాల వల్లే ఫ్రాన్స్ చాలా సంవత్సరాలుగా ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
ఫ్రాన్స్.. 10.20 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
స్పెయిన్.. 9.38 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
అమెరికా.. 7.24 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
టర్కీ.. 6.06 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
ఇటలీ.. 5.78 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
మెక్సికో.. 4.50 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
జర్మనీ.. 3.75 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
జపాన్.. 3.69 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
గ్రీస్.. 3.60 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
థాయ్‌లాండ్.. 3.55 కోట్ల మంది విదేశీ పర్యాటకులు
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం
2024లో ప్రపంచంలో అత్యధిక విదేశీ పర్యాటకులను ఆకర్షించిన దేశాల జాబితాలో భారత్ 39వ స్థానంలో నిలిచింది. 2024లో భారత్‌కు మొత్తం 2.057 కోట్ల (20.57 మిలియన్లు) అంతర్జాతీయ పర్యాటకుల రాక నమోదైంది. ఇందులో 99.5 లక్షల (9.95 మిలియన్లు) విదేశీ పర్యాటకులు, అలాగే ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు.
Also Read: విదేశీ పర్యటన సమయంలో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? వెంటనే ఈ పనులు చేయాలి