Cyclone Arnab Disrupts Train Services: తుఫాను అర్నాబ్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు, వరద నీరు రైల్వే బ్రిడ్జిలపైకి చేరడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని మధ్యలోనే నిలిపివేసింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కూడా రద్దయిన రైళ్లలో ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు, ఒడిశా మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తుఫాను కారణంగా ఒడిశాలోని గంజాం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోని ఇచ్ఛాపురం, ఝాడుపూడి స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే బ్రిడ్జి నంబర్ 1052 దగ్గర నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. స్థానిక వాగు పొంగిపొర్లడంతో బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రైళ్ల రాకపోకలను కొనసాగించడం ప్రమాదకరమని భావించిన అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాక్, బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించిన తర్వాతే రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రభావంతో భువనేశ్వర్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ – విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ – సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ ప్రెస్ లాంటి ముఖ్యమైన రైళ్లను రద్దు చేశారు. అలాగే వివిధ మార్గాల్లో నడిచే ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల సర్వీసుల్లోనూ మార్పులు చేశారు. రైల్వే శాఖ వివిధ సమయాల్లో విడుదల చేసిన ప్రకటనల్లో రద్దు, దారి మళ్లింపు, రీషెడ్యూల్ వివరాలు మారుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో 35 రైళ్లు రద్దు కాగా, 42 రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు. మరికొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపివేశారు. మరోవైపు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోనూ రద్దు, దారి మళ్లింపు చర్యలు చేపట్టారు.
రైళ్ల రద్దుతో వివిధ స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విశాఖపట్నం నుంచి పలాస వరకు ప్రత్యేక రైలును నడిపిస్తోంది. ప్రయాణికులకు తాగునీరు, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అందిస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్ఛాపురం సహా ప్రధాన స్టేషన్లలో ప్రయాణికుల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు.
తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రైళ్ల సర్వీసుల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరిగే అవకాశం ఉంది. సో,ప్రయాణికులు తమ రైలు నంబర్, బయలుదేరే సమయం, ప్రయాణ మార్గాన్ని ముందుగానే చెక్ చేసుకోవాలి. రద్దయిన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న వారు రైల్వే నిబంధనల ప్రకారం రీఫండ్ వివరాలను తెలుసుకోవాలి. రైల్వే శాఖ నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలి.
Read Also: ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులు ఏం చేయాలంటే?