నైరుతి పసిఫిక్ మహా సముద్రంలో కేవలం ఎనిమిది చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం నౌరు. ప్రకృతి విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ పౌరసత్వాలను అమ్మాలని భావిస్తున్నది. ఒక్కో పౌరసత్వానికి ధర $105,000 (రూ.91.38 లక్షలు)గా నిర్ణయించింది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తుఫానులు, తీరప్రాంత కోత కారణంగా నౌరు అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్నది. ఆ సమస్యల నుంచి తట్టుకునేందుకు నిధులను సమకూర్చుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వనరులు లేక ఇబ్బందులు పడుతున్న నౌరు
ప్రపంచంలోని అత్యంత దుర్బల వాతావరణ దేశాలలో ఒకటిగా ఉంది. సంపన్న దేశాల వల్ల ఎదురవుతున్న సంక్షోభం నుంచి తనను తాను రక్షించుకోవడానికి సరైన వనరులు లేవు. పౌరసత్వాన్ని అమ్మడం వల్ల ద్వీపంలోని 12,500 మంది జనాభాలో 90 శాతం మందిని ఎగువ ప్రాంతాలకు తరలించడంతో పాటు కొత్త సమాజాన్ని నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది. “ప్రపంచం వాతావరణ చర్యల గురించి చర్చించుకుంటున్నది. మేమూ మా దేశ భవిష్యత్తును భద్రంగా కాపాడుకునేందుకు చురుకైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం” అని నౌరు అధ్యక్షుడు డేవిడ్ అడియాంగ్ వెల్లడించారు.
వాతావరణ మార్పుల వల్ల నౌరు ద్వీపం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నది. తీర ప్రాంతంలో నివసించే చాలా మంది తమ భూమిని కోల్పోయారు. తుఫానుల కారణంగా కొంత మంది తమ ఇళ్లను కోల్పోయారు. మరికొంత మంది తమ సర్వం కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగి రక్షణ చర్యలకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
42 మిలియన్ డాలర్ల సేకరణ లక్ష్యంగా..
చాలా దేశాలు గోల్డెన్ పాస్ పోర్టులను అమ్మకాలకు ఉంచుతున్నాయి. వాతావరణ సంబంధ సమస్యల నుంచి తమ దేశాలను కాపాడుకునేందుకు ఈ వీసాలను విక్రయిస్తూ, వచ్చిన డబ్బుతో భద్రతా చర్యలను చేపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ పాస్ పోర్టులను పొందే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. నౌరు పాస్ పోర్ట్ ఉన్నవారు యునైటెడ్ కింగ్ డమ్, హాంకాంగ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా 89 దేశాలకు వీసా-రహిత ఎంట్రీ పొందే అవకాశం ఉంటుంది. నౌరు ప్రభుత్వం గోల్డెన్ పాస్ పోర్టుల అమ్మకంతో మొదటి సంవత్సరంలో $5.6 మిలియన్లను ఆర్జించాలని భావిస్తోంది. మొత్తంగా వీటి ద్వారా $42 మిలియన్లకు చేరుకోవాలని ఆశిస్తోంది. మొత్తం ప్రభుత్వ ఆదాయంలో 19% వీటి ద్వారా పొందాలని ప్రయత్నిస్తున్నది.
Read Also: సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి బెస్ట్ డెస్టినేష్స్ ఇవే!
గతంలో ఇబ్బందులు
గతంలోనూ నౌరు దేశం గోల్డెన్ పాస్ పోర్టులను అందించింది. 2003లో మలేషియాలో నౌరు పాస్ పోర్ట్ లను కలిగి ఉన్న ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు అయ్యారు. అప్పుడు ఈ దేశం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గతంలో మాదిరిగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు కఠినమైన పరిశీలన విధానాలను అవలభించనున్నట్లు వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి అధిక ప్రమాదంగా పేర్కొన్న దేశాల పౌరులకు మాత్రం పౌరసత్వం ఇవ్వమని నౌరు సర్కారు వెల్లడించింది.
Read Also: ఈ దేశాల్లో నగ్నంగా ఉండటం తప్పు కాదు, ఇండియాలోనూ ఆ కలర్చర్ ఉందని మీకు తెలుసా?