ప్రస్తుత కాలంలో కొంతమంది సెలబ్రిటీలు ఎక్కువగా లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్ట్ అవుతూ కలకలం సృష్టిస్తున్నారు. ఎంతో పలుకుబడి, హోదా ఉన్నప్పటికీ ఇలాంటి కేసులో ఇరుక్కోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్(Jani master)కూడా ఇలా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక యూట్యూబర్ ప్రసాద్ కూడా ఇలాంటి కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీరియల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మరొక నటుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయ్యారు. మరి ఆ బుల్లితెర నటుడు ఎవరు? ఆయనపై కేసు పెట్టిన బాధిత యువతి ఎవరు? ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
లైంగిక వేధింపుల కేసులో నటుడు అరెస్ట్..
ప్రముఖ బుల్లితెర నటుడు చరిత్ బాలప్ప (Charith Balappa) పై లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బెంగళూరు ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 27) చరిత్ బాలప్ప ని అరెస్టు చేశారు. తెలుగు బుల్లితెరతో పాటు పలు కన్నడ సీరియల్స్ లో కూడా ఇతడు నటించారు. ఇక చరిత్ పై ఆయన ప్రియురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తనను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి, బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అంతేకాదు తన సహచరులతో కలసి తాను ఉంటున్న ఇంట్లోకి చొరబడి వేధించినట్లు తెలిపింది. ఇకపోతే బాధిత యువతి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించారట. దీంతో చరిత్ పై లైంగిక వేధింపులు, దాడి, హత్య బెదిరింపుల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.
మొదటి భార్యకు విడాకులు..
ఇకపోతే చరిత్ బాలప్పకు ఇప్పటికే పెళ్లయి.. విడాకులు కూడా అయ్యాయి. విడాకుల తర్వాత అతను తన మాజీ భార్యతో కూడా గొడవ పడినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. చరిత్ బాలప్ప 2017 లో నటి మంజూని వివాహం చేసుకున్నారు. అయితే 2022 లో ఇద్దరి మధ్య సఖ్యత లేక.. వీరి కుటుంబంలో విభేదాలు వచ్చాయి. దీంతో కోర్టులో విడాకులు తీసుకున్నారు. కోర్ట్ ఆదేశాల మేరకు విడాకుల పరిహారం కోసం నోటీసు పంపించినందుకు చరిత్.. తన మాజీ భార్యను కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. ఇక ఆమె కూడా చరిత్ పై పోలీస్ స్టేషన్లో గత ఏడాది జూన్లో కేసు నమోదు పెట్టింది. అప్పుడు అలా వార్తల్లో నిలిచిన చరిత్ బాలప్ప.. ఇక ఇప్పుడేమో ఏకంగా లైంగిక వేధింపుల కేసులో కేసులో ఇరుక్కోవడంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏదిఏమైనా కన్నడ నటుడు ఇప్పుడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.