AP Govt – Cabinet Advisors : వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వాలు సలహదారులుగా ఎంపిక చేసుకుంటుంది. వారి అనుభవం, ఆలోచనలు రాష్ట్రాని మంచి చేకూర్చుతాయని అలా చేస్తుంటారు. కానీ.. ఈ పదవుల విషయంలోనూ రాజకీయాలకు ప్రాథాన్యతనివ్వడం గత ప్రభుత్వాల హయాంలో చూశాం. ప్రతిపక్షాలను విమర్శించే వాళ్లకు, అధికార పార్టీ కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేసే వారికి వివిధ పేర్లతో, వివిధ హోదాల్లో నియమించారు. వారికి క్యాబినేట్ హోదాలు కల్పించారు… రాష్ట్ర ఖజానా నుంచి వందల కోట్ల చెల్లింపులు చేపట్టారు. కానీ.. చివరికి వారి ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు రాలేదు, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అనే విమర్శలు ఉంటూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా నలుగురు ప్రముఖుల్ని రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది. దేశం గుర్తించదగని, గౌరవించదగిన ఆ వ్యక్తులు, వారి వివరాలు తెలుసుకుందాం.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చేనేత, హస్తకళల రంగాల అభివృద్ధి ఒకటి. ఈ రంగంలోని వ్యక్తలకు చేయూతనిచ్చేందుకు, ఈ రంగాన్ని కొత్త పుంతలు తొగ్గించేందుకు వీలుగా.. విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సుచిత్ర ఎల్లాను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఈమె భారత్ బయోటెక్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. ఈవిడ, ఈమె భర్త డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్లు.. కొవిడ్ కాలంలో ప్రముఖంగా వినిపించారు. వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక బయో టెక్నాలజీ పరిశోధనల్లోనే కొవిడ్ కు టీకాను కనుక్కున్నారు. అతితక్కువ కాలంలోనే సమర్థవంతమైన టీకాను అభివృద్ధి చేసి దేశానికి అందించారు. వీరి సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ దంపతులకు పద్మభూషన్ పురస్కారంతో సత్కరించింది. ఈ పదవిలో ఉంటూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత, హస్త కళా రంగాలను అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న ఉత్తమ విధానాల్ని సూచించడం చేయనున్నారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశోధన, తయారీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాల్ని అందుకోవడంతో పాటుగా.. ఏపీని ఆయా రంగాల్లో కీలంగా చేసేందుకు సలహాలు ఇచ్చేందుకు సతీష్‌రెడ్డి ని ఎంచుకున్నారు. ఈయనకున్న అనుభవం, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేయడం వంటి ప్రత్యేకతల్ని దృష్టిలో పెట్టుకుని ఈ బాధ్యతల్ని అప్పగించారు. ఈయన మార్గదర్శంలోనే… అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న రక్షణ, సాంకేతికతలకు అనుగుణంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించనుంది. అలాగే.. ప్రస్తుతం అంతర్జాతీయంగా విశేషంగా అభివృద్ధి అవుతున్న డీప్‌టెక్, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి డిజిటల్ సాంకేతికతలను రక్షణ రంగ ఉత్పత్తుల్లో వినియోగించుకునేందుకు వీలుగా సలహాలు తీసుకోనున్నారు. సతీష్‌రెడ్డి దేశంలోనే గుర్తింపు పొందిన.. రక్షణ రంగ శాస్త్రవేత్త. గతంలో రక్షణమంత్రికి శాస్త్ర సలహాదారుగా కూడా పని చేసిన అనుభవంతో పాటుగా.. డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా, డీడీఆర్‌డీ కార్యదర్శిగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్‌గా అత్యంత కీలక పదవులు నిర్వహించారు.
Also Read :AP Politics: కూటమిపై కుట్ర.. అంత ఈజీనా..?
ఏపీ ప్రభుత్వం నియమించిన మరో గౌరవ సలహాదారుల్లో ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్ ఒకరు. ఈయన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రోకు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఏపీలోని శ్రీహరి కోటలోనే అద్భుతమైన అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది. ఈ నేపథ్యంలోనే.. పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు వీలుగా అవసరమైన విధానాల రూపకల్పనకు సలహాలివ్వనున్నారు. అలాగే.. శాటిలైట్ టెక్నాలజీతో వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అర్బన్ ప్లానింగ్, వాతావరణ మార్పులు, స్మార్ట్ సిటీలు, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. ఈ రంగాల్లో ఈయన అనుభవాన్ని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పేస్ టెక్నాలజీ రంగ గౌరవ సలహాదారుగా నియమించుకుంది. సోమనాథ్‌కు ఈ రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. పైగా.. 2022 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఇస్రో ఛైర్మన్‌గా అనేక కీలక ప్రాజెక్టుల కోసం పనిచేశారు. అంతకు ముందు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కు కార్యదర్శిగా పనిచేశారు.
Also Read : Posani Krishna – RGV : పోసానిని జైలుకు వదిలేదిన వైసీపీ – వై రాజా.? వాట్ హ్యాపెండ్.?
ఏపీ ప్రభుత్వం ఎంచుకున్న గౌరవ సలహాదారుల్లో డాక్టర్ కేపీసీ గాంధీ ఉన్నారు. ఈయన ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. గతంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల ఫోరెన్సిక్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రపంచంలో అమల్లో విధానాల్ని స్టడీ చేసి.. రాష్ట్రంలో ఫోరెన్సిక్ మౌలిక వసతులు, మానవ వనరులను మెరుగుపరిచేందుకు సలహా ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కోరింది. అలాగే.. ఆయా రంగాల్లో నిధుల్ని రాబట్టేందుకు సైతం సూచనలు చేయాల్సింగా అభ్యర్థించింది. రాష్ట్రంలో నేరాల్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు, నేర పరిశోధనల్లో వేగం కోసం ఫోరెన్సిక్ సైన్స్ రంగం ఎలా మరింత సమర్థవంతంగా పని చేయించాలో.. ఈయన ద్వారా ప్రభుత్వం ప్రణాళికల్ని రచించనుంది.