Adulterated Milk: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు కలకలం రేపాయి. కల్తీ పాలు తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితులను రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కిడ్నీ సమస్యలు విషమించి ఎనిమిది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారని వైద్యులు చెబుతున్నారు. పాలల్లో కలుషిత నీరు లేదా హానికర పదార్థాలు కలిపితే ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటనపై విజయ్ డైరీకి ఛైర్మన్ వ్యవహరిస్తున్న చలసాని ఆంజనేయులు స్పందిస్తూ.. మానవ తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే.. తమ డెయిరీలకు వచ్చే పాలను ముందుగానే కచ్చితంగా టెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. పాల సేకరణ కేంద్రంలోనే ఫ్యాట్ శాతం, ఎస్ఎన్‌ఎఫ్, కలుషితాల పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం పాలను బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లలో చల్లబరచి, కిలోమీటర్ల దూరం వరకు నాణ్యత కాపాడే విధంగా నిల్వ చేస్తారని వివరించారు. అక్కడి నుంచి రిఫ్రిజిరేటెడ్ వాహనాల్లో ఫ్యాక్టరీకి తరలించి.. మరింత శుద్ధి చేసి ప్యాకేజింగ్ చేస్తారని తెలిపారు.
లూజ్ మిల్క్ వినియోగంపై ఆయన హెచ్చరిస్తూ.. స్టెరిలైజ్ చేయకుండా పాలను తీసుకుంటే ప్రమాదమని చెప్పారు. కొందరు పాలను తీసుకెళ్లి చల్లటి నీటిలో ఉంచి తర్వాత పెరుగు కోసం వాడుతారని, ఇది సురక్షితం కాదని సూచించారు. ప్రారంభ దశ నుంచే సరైన పరీక్షలు, శుభ్రత, చల్లని శృంఖల (కోల్డ్ చైన్) పాటిస్తేనే ఇలాంటి ఘటనలు నివారించవచ్చని అన్నారు. ఇలాంటి అక్రమ వ్యాపారాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.