అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు, ట్రంప్ సహచరుడు ఎలన్ మస్క్ కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ‘హ్యాండ్సాఫ్’ పేరుతో దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగుల తొలగింపు, ఆర్థిక వ్యవస్థను కుదేపేసే చర్యలు, మానవహక్కులపై ఉక్కుపాదం సహా ఇతర అంశాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సుమారు 150 సంఘాలకు చెందిన వేలాది మంది ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ నిరసనల్లో పౌర హక్కుల నాయకులు, న్యాయవాదులు, విద్యార్థులు, సీనియర్ సిటిజెన్స్, ఎన్నికల సంఘాల సభ్యులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. వాషింగ్టన్ తో పాటు అన్ని రాష్ట్రాల రాజధానులు, ఇతర ముఖ్యప్రాంతాల్లో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ట్రంప్, మస్క్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక అయిన తర్వాత నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పలు దేశాల మీద ప్రతీకారంతో కూడిన ట్యాక్స్ లను విధిస్తున్నారు. ఆయా టారిఫ్ ల కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్ర పతనానికి కారణం అవుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మున్ముందు ఏం జరుగుతుంది? అనే అంశాలను పట్టించుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు వాణిజ్య యుద్ధానికి కారణం అయ్యే అవకాశం ఉందని అమెరికా ప్రజలు ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీవ్ర ఆగ్రహానికి కారణం అయ్యింది. వేలాది మంది రోడ్ల మీదికి చేరి ర్యాలీలు నిర్వహించారు. ‘హ్యాండ్సాఫ్’ పేరుతో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.
ట్రంప్ 2.0లో అతిపెద్ద నిరసన
ట్రంప్ పాలనలో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, మస్క్ ఆధ్వర్యంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చేపడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు, సామాజిక భద్రతా కార్యక్రమాల కోతలను అమెరికా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ గో బ్యాక్, హాండ్సాఫ్ డెమోక్రసీ, మస్క్ వాస్ నాట్ ఎలెక్టెడ్ లాంటి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామీ లాంటి ముఖ్య నగరాల్లో స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ ఆఫీసుల దగ్గర నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ పాలనలో అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, పర్యావరణ నిబంధనల రద్దును నిరసనకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మస్క్ చేతిలోకి ప్రభుత్వ డేటా వెళ్లిపోతుందని, ఆ డేటా గోప్యతపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత అమెరికాలో జరిగిన అతిపెద్దగా నిరసనగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాంగ్
అటు ట్రంప్, మస్క్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళాకారులు నిరసనకారులకు మద్దతు పలుకుతున్నారు. అందులో భాగంగా రూపొందించిన ‘బేబీస్ ఇన్ వైట్ హౌస్’ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సాంగ్ లో ఇద్దరి నిర్ణయాలను చీల్చి చెండాడారు. ఏఐ టూల్ సాయంతో రూపొందించిన ఈ పాట పెద్ద సంఖ్యలో వ్యూస్ అందుకుంటున్నది.
Read Also: పెంట్ హౌస్ రూ.940 కోట్లా? అంత స్పెషల్ ఏంటో!