Assam Man: మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అగ్నిసాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేసింది ఆ మహిళ. భర్త ఎంతగానో నచ్చజెప్పినా ఏ మాత్రం వినలేదు. చివరకు కోరుకున్న ప్రియుడితో వెళ్లిపోయింది. భార్య నుంచి విడాకులు రావడంతో సంతోషంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఆ వ్యక్తి. ఆనందంతో 40 లీటర్ల పాలతో స్నానం చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
అస్సాంలోని నల్బరీ జిల్లా బరలియాపర్ గ్రామం వార్తల్లో నిలిచింది. ఆ గ్రామానికి మాణిక్ అలీ చట్టబద్ధంగా విడాకులు పొందాడు. అయితే ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. విడాకులు వచ్చిన ఆనందంలో ఎగిసి గెంతేశాడు. అక్కడితో ఆనందం పోదని భావించాడు. ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. ఈ ఘటన చిన్నదైనా సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వ్యక్తి తన జీవితంలో అదొక కీలక మలుపని అంటున్నారు. అతడు సెలబ్రేట్ చేసుకున్న విధానం ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాణిక్.. తాను కొత్తగా జన్మించినట్లు ఉందని చెప్పాడు.
దాంపత్య జీవితం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా జీవిని అయ్యానంటూ మనసులోని మాట బయపెట్టాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పాలతో స్నానం చేయడం ప్రతీకగా ఎంచుకున్నట్లు తెలిపాడు. విడాకులు తీసుకోవాలంటే మనసు అంగీకరించదు. అందుకు దారి తీసిన కారణాలు చాలానే చెప్పాడు.
ALSO ALSO: ఆ ఊళ్లో అడుగుపెట్టాలంటే చెప్పులు విడవాల్సిందే, కలెక్టర్ అయినా సరే
కొన్నాళ్ల కిందట తనకు పెళ్లయ్యిందని, ఓ కొడుకు పుట్టాడని తెలిపాడు. అప్పటికే భార్యకు ప్రియుడున్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నాడు. కొడుకు కోసమైనా భార్య ఉంటుందని భావించాడు. అయినా భార్య రెండుసార్లు కోరుకున్న ప్రియుడితో పారిపోయిందన్నాడు. భార్య చేసిన పనికి కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైందన్నాడు.
కొడుకు భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని నచ్చకపోయినా భార్యతో సంసారం చేయాల్సి వచ్చిందన్నాడు. చిన్న పిల్లాడి కోసం ఆమెను ఇంటికి తీసుకొచ్చినా, ఆమెలో ఏ మాత్రం మార్పురాలేదని, అన్ని ప్రయత్నాలు విఫలం అయిన తర్వాతే విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు. మాణిక్ అలీ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది అభినందిస్తున్నారు.
రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అతడు మంచి పని చేశాడని ప్రశంసిస్తున్నారు. ముందుగానే మేల్కొన్నాడని కొందరన్నారు. పెద్ద మొత్తంలో పాలను వృథా చేయడం సరికాదన్న విమర్శలు లేకపోలేదు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జీవితంలో ఇకపై సంతోషంగా బతుకుతానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు మాణిక్.